పోలీసులకూ ‘ఎన్నికల’ శిక్షణ
పోలింగ్ నియమ నిబంధనలపై సిబ్బందికి అవగాహన
కసరత్తు చేస్తున్న జంట కమిషనరేట్లు
‘డూస్ అండ్ డోంట్స్’తో కరపత్రాల పంపిణీ
సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జంట కమిషనరేట్ల పోలీసులు భారీ బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క ఎన్నికల నియమ నిబంధనలు, చట్టాలపై సిబ్బందికి అవగాహన కల్పించడానికి కరపత్రాలు తయారు చేయిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలోని సిబ్బందితో కలిపి మొత్తం 37 వేల మంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకోనున్నారు. వీరికి ‘స్టాండ్‌ై బె, స్టాండ్ టూ’లు అమలు చేయనున్నారు. వీరంతా విధులు నిర్వహిస్తూ ఎన్నికల నియమ నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు కృషి చేయనున్నారు.
ఈ నేపథ్యంలో వీరందరికీ వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. బందోబస్తు, భద్రత ఏర్పాట్లపై పోలీసులకు ప్రత్యేక అవగాహన అవసరం లేదు. అయితే ఎన్నికల నియమ నిబంధనలు మాత్రం వీరికి అంతగా పరిచయం ఉండదు. ఉన్నతాధికారులకు వీటిపై కొంత పట్టున్నప్పటికీ కింది స్థాయి సిబ్బందికి తక్కువనే చెప్పొచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకున్న జంట కమిషనర్లు ఎన్నికల విధుల్లో ఉండే ప్రతి పోలీస్‌కు ఆ నియమ నిబంధనలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నియమ నిబంధనలను తెలుగులోకి అనువదించి కరపత్రాలు తయారు చేయిస్తున్నారు.
వీటిని విధుల్లో ఉండే పోలీసులకు ‘చేయాల్సినవి, చేయకూడనివి(డూస్ అండ్ డోంట్స్)’ పేరుతో ఇవ్వనున్నారు. పోలింగ్ తేదీకి నాలుగు రోజుల ముందే వీటిని సిబ్బందికి అందించాలని నిర్ణయించారు. జంట కమిషనరేట్ల పరిధిలోని పోలింగ్ స్టేషన్లలను అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక, సున్నితమైనవిగా విభజించారు. వీటిలో పోలింగ్ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు కసరత్తులు ప్రారంభించారు. ఇందుకు ఉపకరించే ఫ్లాగ్‌మార్చ్‌లుగా పిలిచే కవాతులను మరో రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు.
ముఖ్యంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఏరియాలు, కీలక బస్తీల్లో ఈ ఫ్లాగ్‌మార్చ్‌లు నిర్వహించనున్నారు. వీటిలో సాయుధ బలగాలతో పాటు స్థానిక పోలీసులూ పాలుపంచుకుంటారు. సాధారణంగా పోలింగ్‌కు రెండు లేదా మూడు రోజుల ముందే వీటిని ప్రారంభిస్తారు. అయితే ఈసారి మాత్రం వారం రోజుల ముందు నుంచే నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.