ఎన్‌యూలో ప్రతిభ ఆధారిత స్కాలర్‌షిప్పులు
ఎన్‌యూ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ వీఎస్ రావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వంద శాతం వరకు ఫీజు రాయితీలు ఇచ్చేందుకు ఎన్‌యూ (ఎన్‌ఐఐటీ విశ్వవిద్యాలయం) సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని ఎన్‌యూ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ వీఎస్ రావు పేర్కొన్నారు. పరిశ్రమ ఆధారిత వర్సిటీగా దేశంలో మొదటి స్థానం దక్కించుకున్న ఎన్‌యూ, త్వరలో సాంకేతిక, పరిశోధనలపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎన్‌యూ ఫౌండర్ రాజేంద్ర ఎస్ పవార్‌తో కలసి శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ సమీపంలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వర్సిటీలో తెలుగు విద్యార్థులే అధికంగా ఉన్నారన్నారు.
విద్యార్థులు వారికి నచ్చిన అంశాలను ఎంచుకుని పరిశోధనలు చేసేలా వర్సిటీ అవకాశం కల్పించిందన్నారు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు అవకాశం కల్పిస్తోందని, వంద శాతం ప్లేస్‌మెట్ కల్పించే వర్సిటీగా ఎన్‌యూని అభివృద్ధి చేశామన్నారు. తొమ్మిదేళ్లలో 97.6 శాతం విద్యార్థులకు 30 కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయన్నారు. గ్రీన్ ఎయిర్ కండీషన్ సిస్టంలో క్యాంపస్‌ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో మార్కులు ఆధారంగా, బిట్‌శాట్, జేఈఈ మెరిట్‌తో పాటు వర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్షల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తామన్నారు.