
లిఫ్ట్ చైన్ తెగి యువకుడి దుర్మరణం
హైదరాబాద్ : కంపెనీలో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్ చైన్ తెగి యువకుడు దుర్మరణం చెందాడు. కూకట్‌పల్లి ఎస్‌ఐ వెంకన్న కథనం ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన సంద్రి రవితేజ (18) మూసాపేట హబీబ్‌నగర్‌లో ఉంటూ ప్రశాంత్‌నగర్‌లోని రికా లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం పని నిమిత్తం కంపెనీకి వెళ్లాడు.
ఆఫీసుకు సంబంధించిన సరుకును లిఫ్ట్‌లో నుంచి దించుతుండగా 3వ అంతస్తులో ఉండగానే లిఫ్ట్ చైన్ తెగి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.