ప్రత్యేక సెలవులుగా సకలజనుల సమ్మెకాలం
* హెల్త్‌కార్డులపైనా నిర్ణయం
* మొదట రాష్ట్ర పీఆర్‌సీ కావాలి ఆ తరువాతే కేంద్ర పీఆర్‌సీ
* ముఖ్యమంత్రికి ఉద్యోగసంఘాల నేతల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణరాష్ట్ర సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు 2010లో చేసిన 42 రోజుల సకలజనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
దీంతో లక్షలాది మంది ఉద్యోగులకు, సమ్మె తరువాత రిటైరయిన దాదాపు 40 వేల మంది పెన్షనర్లకు 42 రోజుల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. అంతే కాకుండా హెల్త్ కార్డులపైనా సాధ్యమైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇక కేంద్ర ప్రభుత్వ 7వ పీఆర్‌సీ 2016 నుంచి అమల్లోకి రానున్నందున అప్పటి వరకు రాష్ట్ర 10వ పీఆర్‌సీ సిఫారసులను అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
తమకు సెంట్రల్ పీఆర్‌సీ కాకుండా సెంట్రల్ పీఆర్‌సీలోని వేతనాలకు సమాన వేతనాలు ఇస్తూ రాష్ట్ర పీఆర్‌సీనే అమలు చేయాలని వారు కోరుతున్నారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, పి.మధుసూదన్‌రెడ్డి, విఠల్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదిరులు కలసి వివిధ అంశాలపై చర్చించారు.
ప్రత్యేకరాష్ట్రం కోసం 2010 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు తెలంగాణ ఉద్యోగులు చేసిన 42 రోజులు సమ్మెకాలాన్ని గతప్రభుత్వం ఆర్జితసెలవులుగా పరిగణించింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు 42 రోజుల ఈఎల్స్‌ను కోల్పోయారు. హాఫ్ పే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద అమ్ముకునేందుకు వీలు కలిగిన ఈ 42 రోజులను ఈఎల్స్ కింద వినియోగించినట్టు పేర్కొని కోతపెట్టడంతో వాటిని పెన్షనర్లు అమ్ముకునే వీలు లేకపోయింది.
దీంతో సకలజనుల సమ్మెను స్పెషల్ లీవ్‌గా ప్రభుత్వం మంజూరు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. కాగా, ఉద్యోగులు, పెన్షనర్ల అభిప్రాయాలకు అనుగుణంగా హెల్త్‌కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
మొదట పదో పీఆర్‌సీ అమలుకు విజ్ఞప్తి..
ముఖ్యమంత్రి కేంద్ర పీఆర్‌సీని అమలు చేస్తామని చెబుతుంటే, ఉద్యోగులు మాత్రం ప్రస్తుతం పదోవేతన సంఘం సిఫారసులనే అమలు చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే కేంద్ర పీఆర్‌సీ వేతనాలకోసం 2016 వరకు ఆగాల్సిందే. ఉద్యోగులు అప్పటివరకు ఆగే పరిస్థితి లేదు. అందుకే రాష్ట్ర పీఆర్‌సీ సిఫారసులను వెంటనే అమల్లోకి తేవాలని కోరుతున్నారు.