16న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు! | Engineering seats allocation on july 16 | Sakshi
Sakshi News home page

16న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు!

Published Sun, Jul 10 2016 3:41 AM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

16న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు!

16న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు!

- వెబ్ ఆప్షన్ల గడువు మరో రెండు రోజులు పొడిగింపు
- హైకోర్టు ఆదేశాలతో షెడ్యూలు మార్పునకు
- ఉన్నత విద్యా మండలి కసరత్తు
- ముందస్తు షెడ్యూలు ప్రకారమే చివరి దశ కౌన్సెలింగ్

 
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాల షెడ్యూలులో మార్పులు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వెబ్ ఆప్షన్ల గడువు మరో రెండు రోజులు పొడిగించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి, 16వ తేదీన సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. కోర్టు ఉత్తర్వుల కాపీ అందగానే ఒకటీ రెండు రోజుల్లో షెడ్యూలును అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైంది.
 
 ముందస్తు షెడ్యూలు ప్రకారం.. మొదటి దశ కౌన్సెలింగ్‌లో ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటల వరకు 90,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే వీలు ఉంది. 10, 11 తేదీలు, 12వ తేదీ ఉదయం 10 గంటల వరకు అన్ని ర్యాంకుల వారు వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం, మార్పులు చేసుకునే ప్రక్రియ 12వ తేదీ ఉదయం 10 గంటలకు ముగియాల్సి ఉంది. 14న సీట్లను కేటాయించాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశాల మేరకు వెబ్ ఆప్షన్లను ఈనెల 14 వ తేదీ ఉదయం 10 గంటలవరకు పొడిగించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో సీట్ల కేటాయింపును 14న కాకుండా 16వ తేదీన ప్రకటించేందుకు సిద్ధమైంది. హైకోర్టు ఉత్తర్వుల కాపీ అధికారికంగా అందగానే వెబ్ ఆప్షన్ల గడువు పెంపు ప్రకటనను జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది.
 
కాలేజీల్లో చేరే షెడ్యూలుకు, చివరి దశ కౌన్సెలింగ్‌కు దీనితో ఎలాంటి ఇబ్బంది లేదని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 21వ తేదీ వరకు ఫీజు చెల్లించి, కాలేజీల్లో చేరవచ్చని, ఈ షెడ్యూలులో మార్పు ఉండకపోవచ్చని, అవసరమైతే 23వ తేదీ వరకు కూడా ఫీజు చెల్లింపు, కాలేజీల్లో చేరేందుకు అవకాశం ఇచ్చే వీలుంటుందని వెల్లడించారు. ఇక చివరి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈనెల 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టి, ఆయా తేదీల్లోనే వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు 27న సీట్లను కేటాయించి, 29 వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించ నున్నారు.
 
 ఆప్షన్లు ఇచ్చిన వారు 63,067 మంది
 ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా శనివారం వరకు 68,118 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా 63,067 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల సంఖ్య 30,78,057 కు చేరింది. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు సూచించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement