
ప్రతి పనికీ ... ఓ రేటుంది బాస్
అదృష్టం కలిసొచ్చి .. అధికార పార్టీ టికెట్‌పై తొలిసారిగా ఎమ్మెల్యే పదవి దక్కించుకున్న ఓ నేత తీరు వివాదాస్పదం అవుతోంది. ఒక మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్న సదరు ఎమ్మెల్యే ఆయన సొంత జిల్లాలో వేలు పెట్టని నియోజకవర్గం లేదట. పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఇక చెప్పనలవి కాకుండా ప్రతాపం చూపిస్తున్నారట సదరు గులాబీ ఎమ్మెల్యే. ఎస్సైల పోస్టింగులు, సీఐల ట్రాన్స్‌ఫర్లు.. అధికారులకు నచ్చిన చోట పనిచేసుకునే వెసులుబాటు .. ఇలా ఆయన పైరవీ చేయని రంగమే లేదు. కాకుంటే.. ‘ప్రతీ పనికి ఓ రేటుంది బాస్ ’ అంటూ సదరు ఎమ్మెల్యే బహిరంగంగానే బేరమాడేస్తున్నారు.
ఇక, సదరు ఎమ్మెల్యే పైరవీతో అనుకున్న చోట పోస్టింగు దక్కించుకున్న కొందరు పోలీసు అధికారులు .. సంపాదన వేటలో పడ్డారని, పెట్టిన ఖర్చు రాబట్టుకోవద్దా ఏంటీ..? అంటూ తమ సహచరుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్టు వినికిడి. ‘చిన్నదో చితకదో మా పనులు మేం చేసుకుంటాం కదా.. తన నియోజకవర్గం సరిపోలేదని, మా నియోజకవర్గాల్లో వేలు పెడుతుంటే మేమేం చేయాలంటూ..’ పార్టీ నేతలు వాపోతున్నారు.
అమాత్యునికి చెబుదామంటే.. ఆయనకే అత్యంత నమ్మకస్తుడైన ఎమ్మెల్యే కావడంతో ఫిర్యాదు చేసుడెందుకు..? అనవసరంగా మంత్రి దగ్గర చెడు కావడం ఎందుకని ఎవరికి వారు తమలో తామే మధనపడిపోతున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఓ జిల్లాకు చెందిన ఈ ఎమ్మెల్యే పోకడ చూస్తుంటే ... ‘మళ్లీ మనకు టికెట్ వ చ్చేది ఉందా...? వస్తే గెలిచేది ఉందా..? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాం..’ అన్నట్టు ఉందని గులాబీ శ్రేణులు చె వులు కొరుక్కుంటున్నాయి..!!