నయీమ్... అప్పట్లో ఓ ఇన్‌ఫార్మర్
‘సాక్షి’తో రిటైర్డ్ ఐపీఎస్ శ్రీరామ్ తివారీ
► ఇంత పెద్ద గ్యాంగ్‌స్టర్ అయ్యాడా?
► నక్సలైట్లపై ప్రతీకారమే అతని లక్ష్యం
►మాధవరెడ్డిపై దాడిని ముందే హెచ్చరించాడు
సాక్షి, హైదరాబాద్: నయీమ్ పదిహేడేళ్ల కింద ఓ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా తనకు తెలుసని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో 1997-2000 మధ్య ఎస్‌ఐబీ చీఫ్‌గా పని చేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీరామ్ తివారీ చెప్పారు. అప్పట్లో నక్సలైట్ల కార్యకలాపాలపై నయీమ్ సమాచారం చేరవేసేవాడన్నారు. నక్సలైట్ల అణిచివేత కార్యకలాపాలకు పోలీసు విభాగం అతన్ని అప్పట్లో వాడుకుందని చెప్పారు. ‘‘ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసులో పోలీసులకు పట్టుబడ్డ నయీమ్ కొంతకాలం జైలులో ఉన్నాడు. లొంగిపోయాక ఇన్‌ఫార్మర్‌గా పని చేశాడు. నేను ఎస్‌ఐబీలో ఉండగా రెండు మూడుసార్లు నన్ను కలిశాడు. చాలా భావోద్వేగంతో మాట్లాడేవాడు. నక్సలైట్లపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆరాటం అతనిలో కనిపించేది. నక్సలైట్లకు సంబంధించిన సమాచారం ఇచ్చేవాడు. అతనిచ్చే సమాచారం పక్కాగా ఉండేది.
(చంద్రబాబు హయాంలో) అప్పటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య గురించి నయీమ్ మమ్మల్ని ముందే హెచ్చరించాడు. అప్పుడతను ఏదో కేసులో జైళ్లో ఉన్నాడు. ఒక పెద్ద వికెట్‌ను పీపుల్స్‌వార్ టార్గెట్ చేసిందంటూ సమాచారం చేరవేశాడు. కొన్ని వివరాలు కూడా వెల్లడించాడు. కానీ వాటిని సాంకేతికంగా మేం సరిగా డీకోడ్ చేయలేకపోయాం.. పెద్ద వికెట్ ఎవరనేది కూడా సరిగా అంచనా వేయలేకపోయాం. (అప్పటి) సీఎం చంద్రబాబును టార్గెట్ చేసి ఉంటారని అటువైపు దృష్టి సారించాం. కానీ హోంమంత్రి మాధవరెడ్డి కాన్వాయ్‌పై ఘట్‌కేసర్ వద్ద అటాక్ జరిగింది. రాత్రి వేళ అలా జరుగుతుందని ఊహించలేకపోయాం. ఈ విషయమై నయీమ్ ఇచ్చిన సమాచారం పక్కాగానే ఉంది. మేమే దాన్ని సరిగా డీకోడ్ చేయలేకపోయాం’’ అని గుర్తు చేసుకున్నారు. ‘‘సమాచారమిచ్చే వారికి పోలీసు విభాగం డబ్బులిచ్చేది. అలా నయీమ్‌కు కూడా కింది స్థాయి అధికారులు డబ్బులిచ్చే వారు’’ అని చెప్పారు. అతనో గ్యాంగ్‌స్టర్‌గా మారాడని, వేల కోట్లు సంపాదించాడని అతని ఎన్‌కౌంటర్ తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు చూస్తే తనకే ఆశ్చర్యంగా ఉందన్నారు.