కృష్ణా జలాల్లో రెండున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ చేసిన అదనపు నీటి వినియోగాన్ని సర్దుబాటు చేసే అంశాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీ అంశాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లనున్న తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో రెండున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ చేసిన అదనపు నీటి వినియోగాన్ని సర్దుబాటు చేసే అంశాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన అవగాహన మేరకు అదనంగా ఏ రాష్ట్రమైనా నీటిని వినియోగిస్తే నీటి లభ్యత ఉన్న సమయాల్లో వాటిని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. 2014-15లో ఏపీకి 367 టీఎంసీల మేర కేటాయించగా.. 33 టీఎంసీల మేర అధికంగా వినియోగించింది. 2015-16లో తెలంగాణ 75 టీఎంసీలు, ఏపీ 129 టీఎంసీలు వాడుకున్నాయి. నిర్దిష్ట నిష్పత్తి ప్రకారం చూస్తే.. తెలంగాణ కన్నా ఏపీ 13 టీఎంసీలు అదనంగా వాడుకుంది. వీటిలో కొంత నీటినైనా ఈ ఏడాదిలో సర్దుబాటు చేయాలని తెలంగాణ కోరనుంది.
చెన్నై తాగునీటిని విడుదల చేయండి..: చెన్నై తాగునీటి అవసరాల నిమిత్తం వారికి ఇప్పటికే కేటాయించిన 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు సోమవారం తెలుగు రాష్ట్రాలకు సూచించింది. శ్రీశైలం నుంచి ఈ నీటిని విడుదల చేయాలంటూ బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. కాగా జూరాల ప్రాజెక్టు పరిధిలో టెలీమెట్రీ అమలు అంశంపైనా సోమవారంతో బోర్డు తన కసరత్తు ముగించింది. 6 చోట్ల టెలిమెట్రీ పరికరాలను అమర్చాలని నిర్ణయించింది.