ఫేస్‌బుక్ మార్చేనా 'ఫేట్'..?
మూసాపేట: జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో కొత్త పుంతలు.. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల అగచాట్లు. ప్రచార పర్వానికి దొరికిన ఏ అవకాశాన్ని వదలట్లేదు అభ్యర్థులు. టీనేజ్ కుర్రోడి నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు అకౌంట్ ఉన్న ఫేస్‌బుక్‌ను తమ ప్రచారానికి వేదికగా వాడుకుంటున్నారు.
ఇప్పటివరకు ఫేస్‌బుక్ అకౌంట్ లేని అభ్యర్థులు అర్జంట్‌గా అకౌంట్ ఓపెన్ చేసేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ హైటెక్ ప్రచారం చేస్తున్నారు. దీంతో డివిజన్ల ప్రజలకు అభ్యర్థుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వెల్లువలా వస్తున్నాయి. పార్టీ కరపత్రాలు, ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, భవిష్యత్‌లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
'ఫేస్‌బుక్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడమే కాకుండా వారి నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరించొచ్చ'ని అంటున్నారు నేతలు. కొంత మంది అభ్యర్థులైతే సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ల నిర్వహణ కోసమే ప్రత్యేకంగా ఆపరేటర్లను నియమించుకుంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..!