హెచ్‌సీయూలో 'ఫేస్‌బుక్' వార్ | Facebook war in Hyderabad central university | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూలో 'ఫేస్‌బుక్' వార్

Published Wed, Aug 5 2015 9:42 AM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM

హెచ్‌సీయూలో 'ఫేస్‌బుక్' వార్ - Sakshi

హెచ్‌సీయూలో 'ఫేస్‌బుక్' వార్

విద్యార్థి సంఘాల ఆందోళనలతో అట్టుడికిన వర్సిటీ
 
 హైదరాబాద్: తమ సంఘ నాయకులను దూషిస్తూ ఏబీవీపీ నాయకుడు ఫేస్‌బుక్‌లో కామెంట్లు చేశారని ఓ సంఘం.. తమపై దాడి చేశారని మరో సంఘం నాయకులు పోటాపోటీగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మంగళవారం ఆందోళనలకు దిగాయి. ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌పై అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు దాడి చేశారని ఆరోపిస్తూ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఏబీవీపీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు వర్సిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు వచ్చి ఆందోళనకు మద్దతు పలికారు. దాడికి పాల్పడిన విద్యార్థులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 వారిని శిక్షించండి: ఏఎస్‌ఏ
 అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులను గూండాలుగా పేర్కొంటూ ఫేస్‌బుక్‌లో కామెంట్స్ చేసిన సుశీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏఎస్‌ఏ, ఇతర విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అకారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏఎస్‌ఏ సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితులను, అణగారిన వర్గాలను కించపరిచేలా ఏబీవీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని, ఈ కామెంట్లు దానిలో భాగమేనని ఆరోపించారు. ఎస్‌ఎఫ్‌ఐ, డీఎస్‌యూ, ఎంఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, టీఎస్‌ఎఫ్, ఓబీసీఏ, టీఆర్‌ఎస్వీ సంఘాల నేతలూ ఆందోళనలో పాల్గొన్నారు.  అదుపులోకి తీసుకున్న ఏఎస్‌ఎ నాయకులను పోలీసులు విడుదల చేశారు.

 కమిటీ ఏర్పాటు చేస్తాం: వీసీ
 వివాదంపై అధికారులు, అధ్యాపకులతో కమిటీ వేసి నిజానిజాలు తేలుస్తామని విద్యార్థి నాయకులకు వర్సిటీ వీసీ ఆర్‌పీ శర్మ హామీ ఇచ్చారు. గొడవపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement