
సమాజం కోసమే...వేట
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌కు చెందిన హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ బీహార్ రాష్ట్రంలో మరో వేట ప్రారంభించారు. అక్కడి మకామా ప్రాంతంలో పంట పొలాలను ధ్వంసం చేస్తున్న నీల్‌గాయిల వేట ప్రారంభించారు. ఈ విషయంపై గురువారం కేంద్ర మంత్రులు మేనకాగాంధీ, ప్రకాష్ జవదేకర్ మధ్య మాటల యుద్ధం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాలు..మకామా ప్రాంతంలోని అడవుల నుంచి బయటకు వచ్చి సమీపంలోని పొలాలపై నీల్‌గాయిలు దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. తీవ్రంగా నష్టపోతున్న రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. వాటిని కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా సాధ్యం కాకపోవడంతో ఆ ప్రభుత్వం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వేటగాడు షఫత్ అలీ ఖాన్‌ను పిలిచింది. దీంతో ఆయన ఆదివారం అక్కడికి చేరుకుని రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో చర్చించారు. పరిస్థితుల్ని అధ్యయనం చేసిన తర్వాత నీల్‌గాయిలను అవసరమైన సంఖ్యలో కాల్చిచంపడమే పరిష్కారమని నిర్ణయించారు. దీనికి బీహార్ ప్రభుత్వంతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సైతం అనుమతి తెలపడంతో అలీ ఖాన్ తన ఆపరేషన్ ప్రారంభించారు.
మకామా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో కాపుకాసిన ఆయన నాలుగు రోజుల్లో 300 నీల్‌గాయిలను చంపారు. ఈ విషయంపై ఓ జాతీయ ఛానల్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్న జంతు ప్రేమికురాలు మేనకాగాంధీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఆమె తన సహచర మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను ‘వేట’పై తీవ్రంగా విమర్శించారు. దీనికి జవదేకర్ సైతం ఘాటుగా స్పందించడంతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మేనకాగాంధీ సదరు జాతీయ ఛానల్‌తో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి వచ్చిన షూటర్ కుటుంబం మూడు తరాలుగా జంతువుల్ని వేటాడుతోందని వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై ‘సాక్షి’ ఫోన్ ద్వారా షఫత్ అలీ ఖాన్‌ను సంప్రదించగా... ‘మూడు తరాల నుంచి మా కుటుంబం వేటాడుతోంది సమాజం కోసమే. మ్యానీటర్స్‌గా మారిన పులులు, చిరుతలతో పాటు అమాయకుల్ని పొట్టనపెట్టుకున్న ఏనుగుల్ని మాత్రమే చంపాం. ప్రతి అంకంలోనూ ఆయా ప్రభుత్వాలు అధికారికంగా కోరి, అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ పని చేస్తున్నాం. పట్టుకోవడం, మత్తు ఇవ్వడం సాధ్యం కాని పక్షంలోనే ఆఖరి అవకాశంగా ఆయా జంతువుల్ని చంపాల్సి వస్తోంది. మకామాలో నిరుపేద రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలోనే నీల్‌గాయి(బ్లూబుల్స్)లను వేటాడాల్సి వస్తోంది. ఏసీ గదుల్లో కూర్చునే వారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియక, అర్థం చేసుకోలేక కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని అన్నారు.