కిరాతకుడు | father kille her childrens | Sakshi
Sakshi News home page

కిరాతకుడు

Published Wed, May 28 2014 12:54 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

కిరాతకుడు - Sakshi

కిరాతకుడు

  •  కన్నతండ్రి ఘాతుకం
  •  పిల్లలను చంపి.. ఆత్మహత్యాయత్నం
  •  స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఘటన
  •  హత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు
  •  దుండిగల్, న్యూస్‌లైన్: మానవత్వం మంటగలిసింది.. సభ్యసమాజం తల దించుకుంది.. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు.. ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కలకలం సృష్టించిన ఈ సంఘటన మంగళవారం దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నర్మేట మండలం గండిరామరం గ్రామానికి చెందిన కొండేటి సంపత్‌కుమార్ (40)కు అదే జిల్లా మద్దూర్ మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన గాజుల మురహరి, అండాలు కుమార్తె కరుణ (లక్ష్మి)తో పదకొండేళ్ల క్రితం వివాహం జరిగింది. పదేళ్ల క్రితం కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చిన సంపత్.. సూరారం కాలనీ డివిజన్ సాయిబాబా నగర్ పాండు బస్తీలో నివసిస్తున్నాడు.
     
    వీరికి రాకేష్(10), రాజశ్రీ (09) అనే ఇద్దరు పిల్లలున్నారు. డీసీఎం డ్రైవర్‌గా పనిచేసే సంపత్ భార్య కరుణ గత సంవత్సరం ఫిబ్రవరి 15న అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి పిల్లలిద్దరూ బోరబండలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. స్థానికంగా ఉన్న భార్గవి విద్యానికేతన్ స్కూల్‌లో రాకేశ్ 5వ తరగతి, రాజశ్రీ 4వ తరగతి చదువుతున్నారు. కాగా పది రోజుల క్రితం బోరబండలోని అత్తగారి ఇంటికి వెళ్లిన సంపత్.. వేసవి సెలవులకు పిల్లలను తీసుకెళ్తానని చెప్పి తన ఇంటికి తీసుకు వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి రాకేశ్, రాజశ్రీలకు మొదట విషం ఇచ్చి ఆ తరువాత ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు.
     
     ఆనక మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో సంపత్ పురుగుల మందు (ఎండ్రిన్) తాగాడు. వెంటనే బయటకు వచ్చి తనంతట తానే కొట్టుకుంటుండగా.. స్థాని కులు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఇద్దరు చిన్నారులు మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు. వారు అందించిన సమాచారం మేరకు దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సంపత్‌ను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారుల మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపారు. కాగా సంపత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
     
     చిన్నారులను ఎందుకు హత్య చేసినట్టు?

     గత సంవత్సరమే సంపత్ భార్య చనిపోయింది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల ఆలనాపాలన వారి అమ్మమ్మ వాళ్లే చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సంపత్ ఒక్కడే ఉంటున్నాడు. అయితే చిన్నారులను అతి దారుణంగా హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా సంపత్ ఇతర స్త్రీలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని.. గతంలో తన అక్క కరుణను, ఇప్పుడు ఈ పిల్లల్ని హత్య చేశాడని అతని బావమరిది రాంప్రసాద్ ఆరోపిస్తున్నారు.  
     
     ఎలా హత్య చేశాడు?
     పిల్లలిద్దరికీ విషం ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. అయితే గొంతు నులి మి హత్య చేశాడా.. లేక దిండు మొఖానికి అడ్డు పెట్టి చంపాడా.. లేదా పురుగుల మందు తాగించి హత్య చేశాడా అన్న వివరాలు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలనున్నాయి. ఫ్యాన్‌కు మాత్రం టవల్‌తో ఉరి వేసి ఉంది. చిన్నారులను రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య సమయంలో హత్య చేసి ఉండవచ్చని పోలీసు లు భావిస్తున్నారు. కాగా సంపత్ మాత్రం రాత్రంతా ఇంట్లోనే గడిపి ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో ఉన్న ఎండ్రిన్ తాగినట్లు తెలుస్తోంది.
     
     ఇంట్లో గోడలపై రాతలు..
     ఇంట్లోని గోడలపై బొగ్గుతో సంపత్ పలు రాతలు రాశాడు. వారి పిల్లలు రాసినట్లుగా ‘మా అమ్మ కరుణ’ అంటూ ఇంట్లోని అన్ని గోడలపై రాశాడు. పిల్లలే రాసినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అదేవిధంగా స్థానికంగా ఉండే ఓ మహిళ పేరును ప్రస్తావిస్తూ ‘ఐ లవ్ యూ.. నిన్ను నేను మరవను.. నీ గురించే నా మరణం’ అంటూ గోడపై రాశాడు. బాత్‌రూం గోడపై మాత్రం ‘ప్లీజ్ కరుణ నన్ను మన్నించు’ అని రాశాడు. వివాహేతర సంబంధాల కారణంగానే సంపత్ చిన్నారులను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా చిన్నారులను దారుణంగా హత్య చేసిన సంపత్‌ను నడిరోడ్డుపై ఉరి తీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement