ప్రైవేటు వైద్య సీటుకు ఫీజు మోత
♦ ప్రైవేటు ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్ల ఫీజుల పెంపునకు రంగం సిద్ధం
♦ ఎంబీబీఎస్‌లో బీ కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ సీట్లకు 5% పెంచాలని యోచన
♦ ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్రతిపాదనలపై ఏఎఫ్‌ఆర్సీలో చర్చ
♦ సర్కారుకు ప్రతిపాదించాలని నిర్ణయించిన ఏఎఫ్‌ఆర్సీ
సాక్షి, హైదరాబాద్: గతేడాదే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీట్లకు ఫీజులు పెంచిన ప్రభుత్వం... ఈ ఏడాది మరోసారి ఫీజులు పెంచేందుకు సన్నద్ధమైంది. ప్రభుత్వం ప్రైవేటు వైద్య కళాశాలల ఒత్తిడికి తలొగ్గడంతో డబ్బున్నోళ్లే డాక్టర్ కోర్సు చదివేలా పరిస్థితి తయారైంది. ప్రైవేటు యాజమాన్యాలకు కాసుల వర్షం కురియనుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఫీజులు పెంచాలని ఇటీవల అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ)కి ప్రతిపాదించాయి. దీనిపై ఏఎఫ్‌ఆర్సీ మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలో ప్రస్తుతం బీ కేటగిరీ సీటు ఫీజు ఏడాదికి రూ. 9 లక్షలుండగా... ఆ ఫీజును రూ. 11 లక్షల నుంచి రూ. 13 లక్షల మధ్య పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అలాగే సీ కేటగిరీ (ఎన్‌ఆర్‌ఐ) సీట్ల ఫీజు రూ. 11 లక్షలుండగా... రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే పీజీ వైద్య సీట్లకు కూడా ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు పెంచాలని కోరాయి. ఈ ప్రతిపాదనలపై ఏఎఫ్‌ఆర్సీ కూలంకషంగా చర్చించింది.
ఎంబీబీఎస్‌కు 5%... పీజీకి 10%
తెలంగాణలో 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో మొత్తం 1,450 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో 50 శాతం (725) సీట్లను ఎంసెట్ ద్వారా ర్యాంకు తెచ్చుకున్నవారికి ప్రభుత్వ ఫీజు(60 వేలు) ప్రకారం కేటాయిస్తారు. 35 శాతం (507) బీ కేటగిరీ సీట్లను ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా నింపుతారు. మరో 15 శాతం (218) సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద కాలేజీ యాజమాన్యాలు నేరుగా భర్తీ చేసుకుంటాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు బీ కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు ఫీజులు పెంచమని కోరాయి.
గతేడాది ఫీజులు పెంచినప్పటికీ అనుకున్నంత స్థాయిలో పెంపు జరగలేదని ప్రైవేటు కళాశాలలు వాదిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, లైబ్రరీ, భవనాలు, ఇతరత్రా సదుపాయాలకు పెద్ద ఎత్తున ఖర్చు అవుతున్నందున ప్రస్తుత ఫీజులు సరిపోవనేది వారి వాదన. వీటిని పరిగణనలోకి తీసుకొని అన్ని విషయాలు చర్చించిన ఏఎఫ్‌ఆర్సీ ఎంబీబీఎస్‌లోని బీ కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు 5 శాతం ఫీజు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే పీజీ ప్రైవేటు వైద్య సీట్లకు కూడా 10 శాతం వరకు పెంచాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ మేరకు నడుచుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని ఏఎఫ్‌ఆర్సీ నిర్ణయించినట్లు తెలిసింది.