
వైఎస్ వల్లే మైనారిటీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్
స్కాలర్‌షిప్‌లు.. శాసనసభలో అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధించడమే తన రాజకీయ జీవితంలో అతి గొప్ప విజయమని ఎంఐఎం సభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లనే అది సాధ్యమైందని కొనియాడారు. వైఎస్ ఎంతో గొప్ప మనసుతో మైనారిటీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడంవల్లనే అనేకమంది మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించగలుగుతున్నారని తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఒవైసీ మాట్లాడుతూ... ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులివ్వక పోవడంవల్ల 14 లక్షల మంది విద్యార్థులు కష్టాలు అను భవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు కళాశాలలు మూతబడే పరిస్థితుల్లో ఉన్నాయని తెలిపారు. ప్రతి పేదవాడు డాక్టరు, ఇంజనీరింగ్‌లాంటి ఉన్నత విద్యను అందుకోవాలనే సమున్నత లక్ష్యంతో వైఎస్సార్ 2008లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆయన హఠాన్మరణం వరకూ అద్భుతంగా కొనసాగిన ఈ పథకం ఆ తర్వాత కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన రీయిం బర్స్‌మెంట్ పథకం చారిత్రాత్మకమని మండలిలో షబ్బీర్ అలీ ప్రశంసించారు.