గచ్చిబౌలి, న్యూస్‌లైన్: స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. రూ.8 లక్షల నగదు కాలి బూడిద కాగా బంగారు, వెండి నగలు కరిగిపోయాయి. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. బాధితులు, ఎస్‌ఐ విజయ్‌వర్ధన్ కథనం ప్రకారం... కర్నాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన పూజారి నాగమ్మ 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు.
రాయదుర్గంలో 16 ఏళ్లుగా స్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్నారు. భర్త దుర్గప్ప 9 నెలల క్రితం మృతి చెందడంతో కొడుకు శివకుమార్, కూతురు పద్మలతో కలిసి దుకాణం నిర్వహిస్తోంది. తండ్రి పేరిట ఉన్న గ్యాస్ కనెక్షన్ మార్పించుకునేందుకు మధ్యాహ్నం 2 గంటలకు కొడుకు, కూతురు గచ్చిబౌలిలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు కరెంట్ మీటర్ నుంచి కొద్దిగా మంటలు రావడంతో మనవరాళ్లు, మనవలు పూజ, ప్రియాంక, సాయి, పవన్‌లు మంటలపై నీళ్లు చల్లారు.
దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి చిత్తు కాగితాలపై పడ్డాయి. వెంటనే లోపల పడుకొని ఉన్న నాగమ్మకు విషయం తెలియజేశారు. ఆమె వచ్చి చూసే సరికి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వారంతా బయటకు పరుగు తీశారు. స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. రెండున్నర గంటల పాటు మాదాపూర్, లంగర్‌హౌస్ అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.
కాలి బూడిదైన రూ. 8 లక్షల నగదు...
రెండు ఇనుప పెట్టెల్లో ఉన్న రూ.8 లక్షల నగదు కాలి బూడిదైంది. ఒక పెట్టెలో రూ.5 లక్షలు, మరో పెట్టెలో రూ.3 లక్షల నగదు ఉందని బాధితుడు శివకుమార్ తెలిపారు. రూ.వెయ్యి నోట్ల బండిళ్లు 5, రూ.ఐదు వందల నోట్ల బండిళ్లు-6 అందులో ఉన్నాయన్నారు. అంతేకాకుండా 10 తులాల బంగారు నగలు, 50 తు లాల వెండి ఆభరణాలు మంటల్లో కరిగిపోయాయని చెప్పారు. మూడు బీరువాలు, వాషింగ్ మిషన్, ఫ్రిజ్, కంప్యూటర్, ఇతర సామగ్రి కాలిపోయిందన్నారు. మూడు ప్లాట్ల పత్రాలు పాక్షికంగా కాలిపోయాయి.
పాక్షికంగా కాలిన నోట్లు స్వాధీనం...
రూ.ఐదు వందల నోట్ల బండిళ్లు- 2, మరికొన్ని వంద నోట్లు పాక్షికంగా కాలిపోయాయి. వాటిని బ్యాంక్‌కు పంపించినట్లు సీఐ బాలకోటి తెలిపారు. బంగారం, వెండి నగలు కరిగిపోయి ముద్ద అయ్యాయని తెలిపారు.
పెళ్లి కోసం అప్పు చేశా....
తన చిన్న ఊతురు పద్మ పెళ్లి కోసం రూ. 5 లక్షలు అప్పు తీసుకొచ్చి ఇనుపెట్టెలో పెట్టానని బాధితురాలు నాగమ్మ విలపించారు. కూతురుకు సంబంధాలు చూస్తున్నామని ఈ క్రమంలోనే తమ బంధువు మరో రూ. 3 లక్షల అప్పు ఇవ్వగా రూ.8 లక్షల రూపాయలను రెండు ఇనుప పెట్టెల్లో దాచానని నాగమ్మ చెప్పారు.
అగ్గి.. బుగ్గి
Published Fri, Jan 17 2014 1:44 AM | Last Updated on Sat, Sep 15 2018 8:11 PM
Advertisement
Advertisement