సాక్షి, హైదరాబాద్ : నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి పక్కనే ఉన్న తులసి ప్రింటింగ్ ప్రెస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. నీలోఫర్ ఆస్పత్రి ప్రహరీ గోడకి అనుకుని ఉన్న ఎస్‌ఎస్‌వీ ప్రింటర్స్తో పాటు మరో మూడు ప్రెస్లలో మంటలు వ్యాపించాయి. ఉదయం అయిదు గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రింటింగ్ ప్రెస్‌లో ఉన్న యంత్రాలు, పేపర్లు పూర్తిగా దగ్దం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
కాగా పక్కనే నిలోఫర్‌లోని పిల్లల వార్డుతో పాటు పలు అపార్ట్‌మెంట్లు కూడా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది గంటలోపే మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆస్పత్రిలో రోగులతో పాటు, అటెండర్లు ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా ఆస్పత్రి చుట్టూ ఉన్న మరి కొన్ని ప్రింటింగ్ ప్రెస్లలో ఫైర్ సేఫ్టీ నిబంధనలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒకవేళ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పక తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment