
విమానాశ్రయ పరిసరాల్లో మంటలు
గడ్డికి నిప్పంటించడమే కారణం
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో శనివారం సాయంత్రం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న సరూర్‌నగర్ మండలం సీఐఎస్‌ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రత దళాల) క్వార్టర్స్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి గడ్డికి నిప్పంటించడంతో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, విమానాశ్రయంలోని ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. విమానాశ్రయం రహదారి సమీపంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.