
కాల్పులు జరిగిన ఏటీఎం
- ఏటీఎంలో యువతి నుంచి న గలు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు చోరీ
- హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఘటన
హైదరాబాద్: డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లిన యువతిని ఓ అగంతకుడు రివాల్వర్‌తో బెదిరించి కాల్పులు జరిపాడు. ఆమె వద్ద నుంచి రూ. 65 వేలు విలువచేసే బంగారు నగలు, ఏటీఎం కార్డు,సెల్‌ఫోన్‌ను దోచుకుని పారిపోయాడు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ సంఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా తాటిపాకకు చెందిన శ్రీలలిత మధురానగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ బేగంపేటలోని సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. కాగా, శ్రీలలిత బుధవారం ఉదయం 7.30 గంటలకు డబ్బులు డ్రా చేసేందుకు యూసుఫ్‌గూడలోని ఎస్‌బీఐ బ్యాంకు ఏటీఎంకు వెళ్లింది. ఏటీఎం కార్డు తీస్తుండగా ముఖానికి ముసుగు వేసుకొని వచ్చిన ఓ అగంతకుడు రివాల్వర్ చూపెట్టి ఒంటిపై ఉన్న నగలు తీసి ఇవ్వాలని ఆమెను బెదిరించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో రివాల్వర్‌తో ఏటీఎంలోనే కాల్పులకు తెగబడ్డాడు. తర్వాత ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు , పాస్‌వర్డ్ నంబరు తీసుకుని పారిపోయాడు. జరిగిన ఘటనపై స్థానికుల సహాయంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, ఏటీఎం సెంటర్‌లో కాల్పులు జరిగిన ప్రదేశాన్ని ఇన్స్‌పెక్టర్ రమణగౌడ్ పరిశీలించారు. ఏటీఎంకు కొద్దిదూరంలో పడి ఉన్న బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రివాల్వర్ పేలిన సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, స్థానికంగా మెట్రోరైల్ పనులు నడుస్తున్నందున పెద్దగా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీలో ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు దుండగుడు ముఖానికి గుడ్డ కట్టుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు.