27 నుంచి ఎస్సై అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
- షెడ్యూల్ ప్రకటించిన రిక్రూట్‌మెంట్ బోర్డు
- జూలై 9 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు
సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య, సామర్థ్య పరీక్ష (పీఎంటీ, పీఈటీ)ల షెడ్యూల్‌ను రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఈనెల 27 నుంచి జూలై 5 వరకు అభ్యర్థులకు పీఎంటీ, పీఈటీ నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థుల పరీక్షలకు సంబంధించిన ఇన్టిమేషన్ లెటర్‌ను ఈనెల 18న మధ్యాహ్నం 2 గంటల నుంచి రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tslprb.in లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ప్రతీ రోజు రెండు విడతలుగా 1,200 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం 7 గంటలకు మొదటి బ్యాచ్‌లో 600 మందికి, ఉదయం 10 గంటలకు మరో 600 మందికి టెస్టులు నిర్వహిస్తారు. ఎస్సై (సివిల్/ఏఆర్/టీఎస్‌ఎస్‌పీ/ఎస్‌పీఎఫ్/ఎస్‌ఎఫ్‌వో)లకు సంబంధించి మొత్తం 88,875 మంది అర్హత సాధించారు. వీరికి దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇన్టిమేషన్ లెటర్ ఆధారంగా సంబంధిత తేదీల్లో కేటాయించిన సమయానికి అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే జూలై 4న నిర్వహించే పీటీవో విభాగం అభ్యర్థులు 388 మందికి ఒకే కేంద్రాన్ని కేటాయించారు.
కమ్యూనికేషన్ విభాగం (జూలై 5) అభ్యర్థులు 1,709 మందికి రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేహదారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులు ధ్రువపత్రాలతోపాటు విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలను తీసుకురావాలని రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది. ఇన్టిమేషన్ లెటర్లు పొందే విషయంలో సందేహాలు తలెత్తితే 040-23150362, లేదా 040-23150462 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. మరోవైపు కానిస్టేబుల్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూలై 9 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పూర్ణచందర్‌రావు తెలిపారు. అభ్యర్థుల షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.