‘వర్దా’తో పలు విమానాలు రద్దు
హైదరాబాద్: వాతావరణం అనుకూలించని కారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి మంగళవారం బయలుదేరాల్సిన పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రద్దయిన వాటిల్లో చెన్నైకి వెళ్లాల్సిన ఏడు, తిరుపతి వెళ్లాల్సిన 4, జైపూర్, విజయవాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సిన ఒక్కో ఫ్లయిట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
వర్దా తుపాన్ కారణంగా సోమవారం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నై, తిరుపతితోపాటు, పలు ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో, మస్కట్ నుంచి అక్కడకు వెళ్లాల్సిన ఓమన్ ఎయిర్‌వేస్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. చెన్నై, తిరుపతి, జైపూర్, రాజమండ్రి, ముంబాయి నుంచి హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి మస్కట్ వెళ్లాల్సిన విమానం ఐదు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. హైదరాబాద్–దుబాయి విమానం రెండు గంటలు, హైదరాబాద్– ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు విమానాలు సుమారు ఐదు గంటలు ఆలస్యంగా నడిచాయి.
సాంకేతిక లోపంతో వెనక్కు..: రాజీవ్‌గాంధీ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ వెళ్లే ఎయిర్ ఏసియా విమానం సోమవారం ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకున్న 15 నిమిషాలకు తిరిగి వచ్చింది. విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని సురక్షితంగా ఎయిర్‌పోర్టులో దింపాడు. ఈ సమయంలో విమానంలో 167 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.