vardah
-
ఆ సమాచారం 10 వేల మందిని కాపాడింది!
ముంబై: పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మానవాళికి ఏ విధంగా సహాయపడుతుందో తెలిపే ఉదాహారణ ఇది. ఇటీవల సంభవించిన వర్దా తుపాను తమిళనాడులో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తుఫాను ముందుగా ఆంధ్రప్రదేశ్ దిశగా పయనిస్తుందని భావించినా చివర్లో దిశను మార్చుకొని తమిళనాడుపై ప్రభావం చూపింది. చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలలో ముందస్తు చర్యలు చేపట్టిన సహాయక బృందాలు ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను గమనాన్ని సరిగ్గా అంచనావేయడంతో సుమారు 10 వేల మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ముందస్తు సమాచారానికి ఇస్రో ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు తోడ్పడ్డాయి. అవి ఇన్శాట్ 3డీఆర్, స్కాట్సాట్ అని ఇస్రో అధికారి ఒకరు జాతీయ మీడియాతో వెల్లడించారు. ఇన్సాట్ 3డీఆర్ వాతావరణ అధ్యయనానికి ఉపయోగపడే అడ్వాన్స్డ్ శాటిలైట్. దీనిని సెప్టెంబర్ 8 న జీఎస్ఎల్వీ రాకెట్ సహాయంతో ఇస్రో ప్రయోగించింది. కాగా స్కాట్శాట్ను సెప్టెంబర్ 26న పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఇది వాతావరణ సమాచారంతో పాటు తుపానులను ట్రాక్ చేయడంతో తోడ్పడుతుంది. తుపాను ప్రభావంతో సతీష్ ధావన్ అంతరిక్షకేంద్రం కూడా భారీ వర్షంతో పాటు బలమైన గాలుల తాకిడికి గురైనప్పటికీ ఎలాంటి నష్టం కలుగలేదని ఇస్రో అధికారి తెలిపారు. -
తుపాను ప్రభావంతో పలు రైళ్ల రద్దు
హైదరాబాద్: వార్దా తుపాను ప్రభావం కారణంగా పెనుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దుచేసినట్లు మంగళవారం తెలిపింది. చెన్నై-లక్నో ఎక్స్‌ప్రెస్, చెన్నై-తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్, తిరుపతి- చెన్నై మద్రాస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంగళవారం రద్దు చేశారు. అలాగే 14వతేదీ బుధవారం ఢిల్లీ-చెన్నై గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దుచేశారు. అదే రోజు ఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలును కూడా రద్దుచేశారు. 15వ తేదీ గురువారం లక్నో-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు రద్దైంది. అలాగే పలు రైళ్లను దారిమళ్లించారు. -
‘వర్దా’తో పలు విమానాలు రద్దు
హైదరాబాద్: వాతావరణం అనుకూలించని కారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి మంగళవారం బయలుదేరాల్సిన పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రద్దయిన వాటిల్లో చెన్నైకి వెళ్లాల్సిన ఏడు, తిరుపతి వెళ్లాల్సిన 4, జైపూర్, విజయవాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సిన ఒక్కో ఫ్లయిట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వర్దా తుపాన్ కారణంగా సోమవారం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నై, తిరుపతితోపాటు, పలు ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో, మస్కట్ నుంచి అక్కడకు వెళ్లాల్సిన ఓమన్ ఎయిర్వేస్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. చెన్నై, తిరుపతి, జైపూర్, రాజమండ్రి, ముంబాయి నుంచి హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి మస్కట్ వెళ్లాల్సిన విమానం ఐదు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. హైదరాబాద్–దుబాయి విమానం రెండు గంటలు, హైదరాబాద్– ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు విమానాలు సుమారు ఐదు గంటలు ఆలస్యంగా నడిచాయి. సాంకేతిక లోపంతో వెనక్కు..: రాజీవ్‌గాంధీ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ వెళ్లే ఎయిర్ ఏసియా విమానం సోమవారం ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకున్న 15 నిమిషాలకు తిరిగి వచ్చింది. విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని సురక్షితంగా ఎయిర్‌పోర్టులో దింపాడు. ఈ సమయంలో విమానంలో 167 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. -
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తుపాన్ ప్రభావం వల్ల రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాన్ కారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశముందని పేర్కొంది. మరోవైపు గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. మెదక్, నిజామాబాద్‌లలో 13 డిగ్రీలు, నల్ల గొండ, రామగుండంలలో 14 డిగ్రీలు, హన్మకొండ, ఖమ్మం లలో 15 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో మాత్రం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా రికార్డయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీలు అధికంగా 18, గరిష్ట ఉష్ణోగ్రత 2 డిగ్రీలు అధికంగా 31 డిగ్రీలు నమోదైంది. భద్రాచలంలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా 20 డిగ్రీలు నమోదైంది. -
అండమాన్‌లో చిక్కుకున్న పర్యాటకులు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వార్దా తుఫాను బలపడుతోంది. ప్రస్తుతం ఇది విశాఖకు ఆగ్నేయ దిశగా 1,000 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 1,110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 12న నెల్లూరు-కాకినాడ మధ్య తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. 10వ తేదీ నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు చేశారు. అన్నిపోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. మరోవైపు అండమాన్ నికోబార్ దీవుల్లో సుమారు 1500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వార్దా తుఫాను ప్రభావంతో తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో పోర్ట్ బ్లెయిర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని దీవులు.. హ్యావ్లాక్, నీల్ ప్రాంతాల్లో పర్యాటకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీరిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.