ఆ సమాచారం 10 వేల మందిని కాపాడింది!
ముంబై: పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మానవాళికి ఏ విధంగా సహాయపడుతుందో తెలిపే ఉదాహారణ ఇది. ఇటీవల సంభవించిన వర్దా తుపాను తమిళనాడులో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తుఫాను ముందుగా ఆంధ్రప్రదేశ్ దిశగా పయనిస్తుందని భావించినా చివర్లో దిశను మార్చుకొని తమిళనాడుపై ప్రభావం చూపింది.
చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలలో ముందస్తు చర్యలు చేపట్టిన సహాయక బృందాలు ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను గమనాన్ని సరిగ్గా అంచనావేయడంతో సుమారు 10 వేల మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ముందస్తు సమాచారానికి ఇస్రో ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు తోడ్పడ్డాయి. అవి ఇన్‌శాట్ 3డీఆర్, స్కాట్‌సాట్ అని ఇస‍్రో అధికారి ఒకరు జాతీయ మీడియాతో వెల్లడించారు.
ఇన్‌సాట్ 3డీఆర్ వాతావరణ అధ్యయనానికి ఉపయోగపడే అడ్వాన్స్‌డ్ శాటిలైట్. దీనిని సెప్టెంబర్ 8 న జీఎస్‌ఎల్‌వీ రాకెట్ సహాయంతో ఇస్రో ప్రయోగించింది. కాగా స్కాట్‌శాట్‌ను సెప్టెంబర్ 26న పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఇది వాతావరణ సమాచారంతో పాటు తుపానులను ట్రాక్ చేయడంతో తోడ్పడుతుంది. తుపాను ప్రభావంతో సతీష్ ధావన్ అంతరిక్షకేంద్రం కూడా భారీ వర్షంతో పాటు బలమైన గాలుల తాకిడికి గురైనప్పటికీ ఎలాంటి నష్టం కలుగలేదని ఇస్రో అధికారి తెలిపారు.