అండమాన్‌లో చిక్కుకున్న పర్యాటకులు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వార్దా తుఫాను బలపడుతోంది. ప్రస్తుతం ఇది విశాఖకు ఆగ్నేయ దిశగా 1,000 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 1,110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 12న నెల్లూరు-కాకినాడ మధ్య తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తుఫాను ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. 10వ తేదీ నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు చేశారు. అన్నిపోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.
మరోవైపు అండమాన్ నికోబార్ దీవుల్లో సుమారు 1500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వార్దా తుఫాను ప్రభావంతో తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో పోర్ట్ బ్లెయిర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని దీవులు.. హ్యావ్‌లాక్, నీల్ ప్రాంతాల్లో పర్యాటకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీరిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.