తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తుపాన్ ప్రభావం వల్ల రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాన్ కారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశముందని పేర్కొంది.
మరోవైపు గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. మెదక్, నిజామాబాద్‌లలో 13 డిగ్రీలు, నల్ల గొండ, రామగుండంలలో 14 డిగ్రీలు, హన్మకొండ, ఖమ్మం లలో 15 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో మాత్రం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా రికార్డయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీలు అధికంగా 18, గరిష్ట ఉష్ణోగ్రత 2 డిగ్రీలు అధికంగా 31 డిగ్రీలు నమోదైంది. భద్రాచలంలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా 20 డిగ్రీలు నమోదైంది.