చైనా..టు హైదరాబాద్ వయా చెన్నై
రూ.1.60 కోట్ల విలువైన విదేశీ మద్యం పట్టివేత, ముగ్గురి అరెస్ట్
ఉక్రేయిన్, చైనాల నుంచి రవాణా మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణయ్యు అక్రమ వ్యాపారం
హిమాయత్‌నగర్: చైనా, ఉక్రేయిన్‌ల నుంచి విదేశీ మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.60 కోట్ల విలువైన విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నారాయణగూడలోని ఎక్సైజ్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి, సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ వరప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ భగవాన్‌రెడ్డితో కలసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న ధూల్‌పేటలోని మంగళ్‌హట్ ప్రాంతంలో పోలీసులు కార్డెన్‌సర్చ్ నిర్వహిస్తుండగా ఓ కారులో తరలిస్తున్న 120 విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించడం జరిగిందన్నారు. దీనిపై కారు డ్రైవర్ సునీల్‌ను ప్రశ్నించగా సదరు కారు మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణ అలియాస్ రాధయ్యదిగా తెలిపాడు. దీంతో పోలీసులు మౌలాలీలోని అతని ఇంటిపై దాడులు నిర్వహించగా ‘ఎస్‌వి ఓడ్కా గ్రాన్ ప్రిక్స్, ఎస్‌వి ఓడ్కా ఒరిజనల్’ 146 బాటిళ్లు లభ్యమైయ్యాయి. అనంతరం రాధాకృష్ణను ప్రశ్నించగా గాంధీనగర్‌లోని గోదాంలో మద్యం బాటిళ్లను నిల్వ చేసినట్లు చెప్పడంతో తనిఖీలు నిర్వహించి 455 కార్టన్లు (ఒక్కో దానిలో 15 చొప్పున 10,800 బాటిళ్లు) స్వాధీనం చేసుకున్నామన్నారు.
చైనా, ఉక్రెయిన్‌ల నుంచి అక్రమ రవాణా
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణ 2010లో ‘ఇంపోర్ట్’ లెసైన్స్ తీసుకుని మద్యం బాటిళ్లను తెప్పించేవాడు. 2014నవంబర్‌లో లెసైన్స్ గడువు ముగియడంతో చైనా, ఉక్రేయిన్ దేశాల్లోని మద్యం వ్యాపారులతో రహస్య వ్యాపారం ప్రారంభించాడన్నారు. అక్కడి నుంచి ‘ఎస్‌వి ఓడ్కా గ్రాన్ ప్రిక్స్, ఎస్‌వి ఓడ్కా ఒరిజనల్’ బాటిళ్లను షిప్ ద్వారా చెన్నైకు తెప్పించి.. కంటైనర్లలో హైదరాబాద్‌కు తీసుకొస్తున్నాడన్నారు. గాంధీనగర్‌లోని గోదాంలో నిల్వ చేసి రహస్యం గా సన్నిహితులకు, బంధువుల ద్వారా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైయ్యిందన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం సరిగా లేనందన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతను కోలుకోగానే మరిన్ని వివరాలు రాబట్టి చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
ముగ్గురి అరెస్ట్, మరొకరి కోసం గాలింపు
అక్రమ మద్యం వ్యాపారంలో మరో నలుగురి పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైయ్యిందని కమిషనర్ వివేకానందరెడ్డి తెలిపారు. వారిలో కారు డ్రైవర్ సునీల్ కుమార్(ఏ-1), అభినయ్‌కుమార్(ఏ-2), హర్మిందర్‌సింగ్(ఏ-3), మహేష్‌సింగ్(ఏ-4)లపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.