ఫైనాన్స్‌ల పంగనామాలు | Form -34 mandatory orders | Sakshi
Sakshi News home page

ఫైనాన్స్‌ల పంగనామాలు

Published Mon, Dec 14 2015 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

ఫైనాన్స్‌ల పంగనామాలు

ఫైనాన్స్‌ల పంగనామాలు

సాక్షి,హైదరాబాద్: వివిధ రకాల ఆర్థిక లావాదే వీలు, అగ్రిమెంట్లపై స్టాంప్‌డ్యూటీ చెల్లించ కుండా ప్రైవేటు ఆర్థిక సంస్థ(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ)లు రిజిస్ట్రేషన్ల శాఖకు పంగనామాలు పెడుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది. వరంగల్ జిల్లాలో ఇటీవల కొన్ని ఫైనాన్స్‌లపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ చేసిన దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. రుణం, తాకట్టుపై కొనుగోలు చేసిన వాహనాల అగ్రిమెంట్ల కు సంబంధించి వాటి విలువలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. కానీ పలు ఫైనాన్స్ సంస్థలు ప్రభుత్వ ఆదేశాలను పాటించడంలేదని అధికారుల పరిశీలనలో తేలింది.

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ లిమిటెడ్, మాగ్మ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ సంస్థలు గత నాలుగేళ్లుగా (2010-11నుంచి 2013-14 వరకు) లోన్‌కమ్ హైపోథికేషన్ అగ్రిమెంట్లకు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా రూ.46. 97 లక్షలు ఎగవేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి, చర్యలు చేపట్టాలని రవాణా, రిజిస్ట్రేషన్ల శాఖలకు ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు త దుపరి చర్యలు చేపట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి సుశీల్‌కుమార్ జోషి, రిజిస్ట్రేషన్ల విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ అహ్మద్ నదీమ్‌ను ఆదేశించారు.

 ఫారం-34 తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు
 వాహనాల తాకట్టు అగ్రిమెంట్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ల సమయంలో ఓనర్లుగానీ, ఆర్థిక సంస్థలు గానీ రవాణా శాఖకు ఫారం-34 ద్వారా సమాచారం అందించాలని రవాణాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఇండియన్ స్టాంప్స్ చట్టం ప్రకారం 2005 నుంచే ఈ నిబంధన అమల్లో ఉన్నప్పటికీ.. పలు ఆర్థిక సంస్థలు స్టాంప్ డ్యూటీని చెల్లించడం లేదు. ఆర్బీఐ నిబంధనల మేరకు వాహనాల కొనుగోలుకు రుణాలిస్తున్న బ్యాంకులు మాత్రం 0.5 శాతం స్టాంప్‌డ్యూటీని తు.చ. తప్పకుండా చెల్లిస్తుండగా, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు స్టాంప్ డ్యూటీని ఎగవేస్తూ సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నాయి.

ఈ స్టాంప్ డ్యూటీ వసూలు విషయమై రిజిస్ట్రేషన్, రవాణాశాఖల మధ్య సమన్వయం కొరవడ్డాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు అవకాశంగా తీసుకున్నట్లు తేలింది. తాజాగా సర్కారు ఆదేశాలతో రవాణా, రిజిష్ట్రేషన్ల శాఖలు స్టాంప్ డ్యూటీ వసూళ్లపై దృష్టిపెట్టాయి. రవాణాశాఖ ఉత్తర్వులు జారీచేసిన తేదీ (నవంబరు 26) నుంచి ఫారం-34 లేకుండా రుణంపై తీసుకున్న వాహనాల రిజిస్ట్రేషన్లను అనుమతించడం లేదని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఫైనాన్స్ కంపెనీ చెల్లించకుంటే వాహన యజమాని నుంచి స్టాంప్‌డ్యూటీ వసూలు చేస్తున్నామని వారు తెలిపారు. మరోవైపు ఏళ్లుగా స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టిన ఫైనాన్స్ కంపెనీల భరతం పట్టేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ సన్నద్ధమౌతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement