- అంకితభావం ఉన్న నాయకుడు: పీసీసీ చీఫ్ ఉత్తమ్
- బీసీ రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం: గద్దర్
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ అంత్యక్రియలు హైదరాబాద్‌లోని పురానాపూల్ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అశ్రునయనాల మధ్య ముగిశాయి. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన నివాసం నుంచి మొదలైన అంతిమయాత్ర 12.30 గంటలకు శ్మశాన వాటికకు చేరుకుంది. ఆయన మృతికి సంతాప సూచికంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానుల మధ్య అంత్యక్రియలను నిర్వహించారు.
శివశంకర్ మరణం తీరనిలోటు: ఉత్తమ్
కేంద్ర మంత్రిగా, వివిధ రాష్ట్రాల గవర్నర్‌గా పని చేసిన శివశంకర్.. సమాజం పట్ల మంచి అవగాహన, అంకితభావం ఉన్న నాయకుడని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శివశంకర్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌లో కొద్దిసేపు ఉంచారు. శివశంకర్ పార్థివదేహానికి పూలమాల వేసి ఉత్తమ్ నివాళులర్పించారు. కాంగ్రెస్‌లో క్రియాశీల నాయకునిగా పనిచేశారని, కేంద్ర మంత్రిగా, సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా ప్రతిభావంతంగా వ్యవహరించారని పేర్కొన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పని చేసిన కార్యదక్షునిగా ఘనత వహించారని కొనియాడారు. నిరుపేద కుటుంబంలో జన్మించి, ఉన్నతవిద్యను అభ్యసించారన్నారు. కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీలు వి.హన్మంతరావు. అంజన్‌కుమార్‌యాదవ్, మల్లు రవి, ఎమ్మెల్సీలు రంగారెడ్డి, ఆకుల లలిత, మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ నేత సురవరం సంతాపం
న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా శివశంకర్ దేశానికి తన సేవలు అందించారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి నివాళులర్పించారు. ప్రజాస్వామ్య సంప్రదా యాల పట్ల నిబద్ధతతో నిలబడ్డారని పేర్కొ న్నారు. శివశంకర్ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.
ఆయన పోరాటం ఎనలేనిది
బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఆయన సుప్రీంకోర్టులో చేసిన పోరాటం ఎనలేనిదని మాజీ ఎంపీ వి.హన్మంత రావు, కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, షబ్బీర్ అలీ అన్నారు. మచ్చలేని నాయకుడిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. బీసీల రిజర్వేషన్ల కోసం శివశంకర్ అలుపెరగని పోరాటం చేశారని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు.
అశ్రునయనాల మధ్య శివశంకర్ అంత్యక్రియలు
Published Wed, Mar 1 2017 3:43 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM
Advertisement
Advertisement