72 మంది నేర చరితులు | Forum for Good Governance | Sakshi
Sakshi News home page

72 మంది నేర చరితులు

Published Fri, Jan 29 2016 1:35 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

Forum for Good Governance

నివేదిక విడుదల చేసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో 72 మంది నేర చరితులు పోటీ చేస్తున్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఈ మేరకు పార్టీల వారీగా నేర చరితుల వివరాలతో గురువారం నివేదిక విడుదల చేసింది. వీరిపై నమోదైన కేసుల వివరాలను లక్డీకాపూల్‌లోని సంస్థ కార్యాలయంలో ఉపాధ్యక్షుడు రావు చెలికాని, కార్యదర్శి పద్మనాభరెడ్డిలు వెల్లడించారు. ఈ కేసుల్లో కొన్ని పోలీస్ స్టేషన్లు, మరికొన్ని కోర్టు విచారణల్లో ఉన్నట్లు తెలిపారు. 14 మంది నేర చరిత ఉన్న అభ్యర్థులతో అధికార పార్టీ టీఆర్‌ఎస్ తొలి స్థానంలో నిలిచింది. కాగా కాంగ్రెస్, టీడీపీల నుంచి చెరో 13 మంది, ఎంఐఎం నుంచి 11 మంది బరిలో ఉన్నారు.

ఇక బీజేపీ నలుగురికి, ఎంబీటీ ఇద్దరికి, సీపీఐ, సీపీఎం, ఎస్పీ, బీఎస్పీ ఒక్కో అభ్యర్థికి టికెట్లు ఇచ్చాయి. మరో వైపు 11 మంది స్వతంత్య్ర అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. అభ్యర్థుల గుణగణాల గురించి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ నివేదిక విడుదల చేశామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.  క్రిమినల్ కేసులున్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వొద్దని ఆయా పార్టీలకు లేఖలు రాశామని పేర్కొన్నారు.

అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో జత చేసిన అఫిడవిట్లలో సమర్పించిన వివరాలను రిటర్నింగ్ అధికారులు మీడియాకు వెల్లడించి ఉంటే తమకు ఈ పని ఉండేదే కాదన్నారు. తమ సంస్థ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను సేకరించిందని తెలిపారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నోటా అందుబాటులో ఉంచిన ఎలక్షన్ కమిషన్.. ఈ దఫా ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. త్వరలోనే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement