తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.. త్వరలో జీవో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. నిమ్స్ సహా రాష్ట్రంలోని ప్రభుత్వ, బోధనాసుపత్రులన్నింటిలోనూ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీవో త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 3.97 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మేలు కలుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగులకు ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో ఔట్ పేషెంటు(ఓపీ) ఫీజు వసూలు చేయడంలేదు.
నిమ్స్‌లో మాత్రం రూ.60 వసూలు చేస్తున్నారు. ఇక నుంచి నిమ్స్‌లో కూడా ఓపీ ఫీజును ఎత్తివేయాలని సర్కారు నిర్ణయించింది. జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులు, నిమ్స్, ఉస్మానియా, నీలోఫర్ తదితర ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించడానికి వెసులుబాటు కల్పిస్తోంది. ఉద్యోగులందరికీ ఆరోగ్యకార్డులు ఇచ్చినా ముఖ్యమైన కార్పొరేట్ ఆసుపత్రులు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీపై శస్త్రచికిత్సలు చేయడానికి నిరాకరిస్తున్నాయి.
పైగా అక్కడ వైద్య పరీక్షలకు డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తే ఉద్యోగులను ప్రభుత్వ ఆసుపత్రుల వైపు ఆకర్షించవచ్చని సర్కారు ఆలోచన. ప్రస్తుతం కార్పొరేట్‌స్థాయిలో ఉన్న నిమ్స్ తరహాలోనే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు అత్యాధునిక ల్యాబ్, వైద్య పరీక్షలకు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.
ఉద్యోగులకు ఉచిత వైద్యపరీక్షలు
Published Sat, Jun 13 2015 1:39 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement