కమలంలో నయాజోష్
కేంద్ర మంత్రి దత్తాత్రేయకు అభినందనల వెల్లువ
మూడోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం
భారీ ర్యాలీ... సభకు నేతల సన్నాహాలు
సిటీబ్యూరో: నరేంద్రమోదీ కేబినెట్‌లో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు స్థానం దక్కడం గ్రేటర్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు తెచ్చింది. సికింద్రాబాద్ ఎంపీగా నాలుగుమార్లు గెలిచిన దత్తాత్రేయ 1998- 2004ల మధ్య అప్పటి ప్రధాని వాజ్‌జేయ్ కేబినెట్‌లో రెండు మార్లు పట్టణాభివృద్ధి, రైల్వేశాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ముచ్చటగా మూడోసారి మోదీ కేబినెట్‌లో మంత్రిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. పలువురు పార్టీ నాయకులు దత్తాత్రేయ ప్రమాణస్వీకార ఉత్సవానికి వెళ్లి అభినందించారు. మిగిలిన వారంతా డివిజన్లలో సంబురాలు చేసుకుని అభిమానం చాటుకున్నారు. నగరానికి చెందిన ఎంఎల్‌ఏలు డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, నాయకులు బి.జనార్ధన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి ఢిల్లీలో దత్తాత్రేయను ప్రత్యేకంగా అభినందించారు.
కేంద్ర మంత్రి హోదాలో నగరానికి దత్తాత్రేయ తిరిగి వచ్చే సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచే భారీ ర్యాలీగా వచ్చి అభినందన సభను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.రాజధాని అభివృద్ధికి ప్రత్యేక కృషి: కేంద్రమంత్రి దత్తాత్రేయ కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్ర రాజధాని అభివృద్ధికి విశేష కృషి చేస్తానని బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం సాయంత్రం ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ... తొలుత సికింద్రాబాద్ లోక్‌సభ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కేంద్ర పథకాలన్నీ హైదరాబాద్‌లో అమలయ్యేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.