దారులు.. వాహనబారులు
బహిరంగ సభకు వచ్చిన వాహనాలు 5001
పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
సిటీబ్యూరో: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగ సభకు తరలివచ్చిన వాహనాలతో ట్రాఫిక్ స్తంభించింది. తెలంగాణ జిల్లాల నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకూ వాహనాలు నగరంలోకి వస్తూనే ఉన్నాయి. మధ్యాహ్నం నుంచే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. సాధారణ ట్రాఫిక్‌ను రూట్ మళ్లించినా ఇబ్బందులు తప్పలేదు. కార్యకర్తల వాహనాలకు నిజాం కళాశాల, పీజీ కాలేజ్, మల్లారెడ్డి గార్డెన్స్, సీఎంఆర్ స్కూల్ గ్రౌండ్, ఆశీష్ గార్డెన్, ధోబీఘాట్, రైల్వే డిగ్రీ కళాశాల, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్, నెక్లెస్‌రోడ్డులో పార్కింగ్ పాయింట్లు కేటాయించారు. బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు, స్కూల్, కళాశాల బస్సులు 3001, కార్లు, డీసీఎం, జీపులు 2000 వచ్చాయి. 5001 వాహనాలను పార్కింగ్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కొంత మంది డ్రైవర్లకు వారికి కేటాయించిన పార్కింగ్ పాయింట్లు తెలియకపోవడంతో ఇష్టం వచ్చినట్లు వాహనాలు మళ్లించారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఉండడంతో కొంత ఉపశమనం లభించింది. అంబులెన్స్‌లు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
అష్ట దిక్కుల్లో..
మహబూబ్‌నగర్ వైపు నుంచి వచ్చిన వాహనాలతో మెహదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, బేగంపేట, రసూల్‌పురాలో ట్రాఫిక్ స్తంభించింది.
జహీరాబాద్ రూట్లో వచ్చిన వాహనాలతో కూకట్‌పల్లి, అమీర్‌పేట, బేగంపేట, పీజీ కాలేజ్ రహదారులు రద్దీగా మారాయి.మెదక్,నర్సాపూర్ ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలతో బోయిన్‌పల్లి జంక్షన్, తాడ్‌బండ్, బాలమ్‌రాయ్ రహదారులు కిక్కిరిశాయి.కరీంనగర్ హైవే మీదుగా వచ్చిన వాహనాలతో శామీర్‌పేట్, బొల్లారం, కార్ఖానా, ఎన్‌సీసీ గేట్, డైమండ్ పాయింట్, ధోబీఘాట్, ఇంపీరియల్ గార్డెన్ ప్రాంతాలు వాహనాలతో నిండి పోయాయి.వరంగల్ హైవే మీదుగా వచ్చిన వాహనాలతో ఉప్పల్, తార్నాక, మెట్టుగడ్డ, సంగీత్, రైల్వే డిగ్రీ కాలేజ్, ఆర్‌సీసీ గ్రౌండ్స్, సీఎస్‌ఐ, పీజీ కాలేజ్, కీస్ హైస్కూల్, ఓపెన్ గ్రౌండ్, ఎల్‌అండ్‌ఓ పీఎస్ వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.విజయవాడ హైవే మీదుగా వచ్చిన వాహనాలతో ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు, మలక్ పేట్, ఛాదర్‌ఘాట్, ఎంజే మారె ్కట్, నాంపల్లి, తెలుగుతల్లి ఫ్లైవర్ వరకు స్వల్పంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. లోయర్ ట్యాంక్‌బండ్, కవాడిగూడ, బైబిల్ హౌస్ వద్ద రద్దీ నెలకుంది.
సభకు బస్సులు..ప్రయాణికులకు తిప్పలు
సిటీబ్యూరో : టీఆర్‌ఎస్ సభకు నగరంలోని వివిధ డిపోలకు చెందిన సుమారు 500 బస్సులను తరలించారు. నగరంతో పాటు పరిసర జిల్లాలకూ సిటీ బస్సులు నడిచాయి. దీంతో నగరంలోని పలు రూట్లలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
కిక్కిరిసిన హబ్సిగూడ..
హబ్సిగూడ: హబ్సిగూడ చౌరస్తా నుంచి తార్నాక మెట్టుగూడ వరకు నాలుగు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలతో పాటు ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు గురయ్యారు.