దేశభక్తి కలిగిన ఏకైక పార్టీ బీజేపీ: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో తెలంగాణపై బీజేపీ జెండా ఎగరవేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తి కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు, కుట్రలు జరిగినా బీజేపీ ఎదుర్కొంటుందన్నారు. దేశ ద్రోహులతో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేతులు కలుపుతున్నారని, వందేమాతరంపై చర్చకు రాహుల్, వామపక్షాలు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. హెచ్‌సీయూ ఘటనను అడ్డం పెట్టుకుని బీజేపీని అప్రతిష్టపాలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జంగారెడ్డి, నామాజీ, చింతా సాంబమూర్తి, మంత్రి శ్రీనివాసులు, అమర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.