
'నూరు ప్రశ్నలతో ప్రజా బ్యాలెట్'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తప్పుడు వాగ్దానాలను ప్రజల ముందుకు తీసుకెళతామని వైఎస్సార్ సీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబు చేసింది ఏమీ లేదని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న తలపెట్టనున్న గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
సోమవారం మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యాలయంలో పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. ఎన్నికలయిన తర్వాత ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదన్నారు. చంద్రబాబు పాలనపై నూరు ప్రశ్నలతో ప్రజా బ్యాటెల్ తయారు చేశామని, దీన్ని గడప గడపకు అందిస్తామని చెప్పారు. దీని ద్వారా చంద్రబాబు పాలన బాగుందా, లేదా అనేది కనుక్కుంటామన్నారు. ప్రజా బ్యాలెట్ ప్రశ్నలకు అవును, కాదు అని సమాధానాలు ఇస్తే సరిపోతుందని తెలిపారు. చంద్రబాబు పాలనపై మార్కులు వేయాలని ప్రజలను కోరతామన్నారు.
ప్రజా బ్యాలెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లకు అప్పగించామని, 5 నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంపై ప్రతిరోజు జిల్లా, రాష్ట్రస్థాయిలో పర్యవేక్షిస్తామని చెప్పారు. ఈ రెండేళ్లలో తమ పార్టీ చేసిన ప్రజాపోరాటాల గురించి కూడా ప్రజలకు చెబుతామన్నారు.
జూలై 8న దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆ రోజున వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించి, జెండాలు ఆవిష్కరించాలని పార్టీ నాయకులకు సూచించారు.