ప్రాజెక్టుల ఫైళ్లన్నీ అసెంబ్లీలో పెట్టండి
ఆధారాలతో సహా అవినీతిని నిరూపిస్తాం : శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సాగునీటి ప్రాజెక్టుల వ్యయం పెంపు ఫైళ్లన్నీ అసెంబ్లీలో పెట్టాలని, అందులో జరిగిన వందలాది కోట్ల అవినీతిని ఆధారాలతో సహా నిరూపించడానికి తాము సిద్ధమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలసి విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంలో చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రూ.20 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.200 కోట్లకు పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీమపైద్వేషమెందుకు?: రాజధాని ప్రాంత రైతులు భూములను తక్కువ ధరకు ఇవ్వకపోతే పరిశ్రమలు రాయలసీమకు తరలి పోతాయని చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. ముఖ్యమంత్రే ఇలా చెప్పడం సరికాదన్నారు. అసలు రాయలసీమ అంటే అంత ద్వేషం ఎందుకు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌పై అక్కసెందుకు బాబూ: ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జగన్ నేరమా? అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని బట్టబయలు చేస్తున్నందుకు ‘సాక్షి’ పత్రికను స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తారా? అని ప్రశ్నిం చారు. పత్రికలుమీ అవినీతిని ప్రశ్నించకుండా పొగుడుతూ ఉండాలా అన్నారు. తమ ప్రాంత అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నామని చెబుతున్న ఎమ్మెల్యేలు వారి రాయలసీమకు చంద్రబాబు ఏం చేశారో చెబితే మంచిదన్నారు.