
గేటుపై గలాట
గాంధీఆస్పత్రి,న్యూస్‌లైన్: పాలనాయంత్రాంగం అనాలోచిత నిర్ణయాలతో గాంధీ ఆస్పత్రిలో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రి వెనుకవైపు (పద్మారావునగర్) గేటును మూసివేయడంతో తీవ్ర అసహనానికి గురైన రోగులు, రోగి సహాయకులు గురువారం ఉదయం ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆస్పత్రి వెనుకవైపు ఏర్పాటు చేసిన భారీ గేటును గతంలోనే మూసివేయగా నడక కోసం ఏర్పాటు చేసిన రివాల్వింగ్ గేటును నాలుగురోజులుగా మూసివేశారు. పద్మారావునగర్, చిలకలగూడ, సీతాఫల్‌మండి, వారాసిగూడ, బౌద్ధనగర్, పార్శిగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన రోగులు పెద్దసంఖ్యలో ఇదేమార్గం ద్వారా రాకపోకలు సాగిస్తుం టారు.
మండే ఎండలో సుమారు రెండుకిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్లే ఓపికలేని కొంతమంది రోగులు తాళాలు పగులగొట్టి గేటును తెరిచారు. దీంతో గేటు వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం కొంతమంది వికలాంగులు, రోగులు, రోగి సహాయకులు గేటు తాళాలు తెరవమని సెక్యూరిటీ సిబ్బందిని వేడుకున్నారు. ససేమిరా అనడంతో వాగ్వాదానికి దిగారు. ఆర్‌ఎంవో-1 ప్రమీల, సెక్యూరిటీ సూపర్‌వైజర్ రమేష్‌లు సముదాయించినప్పటికీ ఫలితం లేకపోయింది. పెద్దసంఖ్యలో రోగులు, రోగి సహాయకులు ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను సముదాయించారు.
ఆ గేటు ద్వారా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని..అందుకే గేటు మూసివేశామని సూపరింటెండెంట్ అశోక్‌కుమార్ ఆందోళనకారులకు తెలిపారు. గేటు మూసివేస్తే సమస్య పరిష్కారం కాదని, సీసీ కెమెరాలు, సెక్యూరిటీగార్డులను ఏర్పాటు చేసుకోవాలని, మమ్ముల్ని ఇబ్బందులకు గురిచేయడమేంటని పలువురు రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియమిత వేళల్లో గేటు తెరిచేందుకు చివరకు ఆస్పత్రి అధికారులు అంగీకరించడంతో ఆందోళన సద్దుమణిగింది.
ఎమ్మెల్యేకు ఫిర్యాదు : గాంధీ ఆస్పత్రి అధికారులు చేస్తున్న అనాలోచిత నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌కు పలువురు రోగులు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిని సందర్శించి అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఆయన హామీఇచ్చారు.