కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ పట్టివేత | Gangster Ayub Khan held in mumbai airport | Sakshi
Sakshi News home page

కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ పట్టివేత

Published Mon, Dec 26 2016 10:16 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ పట్టివేత

కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ పట్టివేత

సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న రౌడీషీటర్‌ అయూబ్‌ ఖాన్‌ ఆదివారం ముంబైలో చిక్కాడు. ఇతడిపై లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ అయి ఉండటంతో షార్జా నుంచి వస్తూ ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్‌ సిబ్బందికి దొరికాడు. విషయం తెలుసుకున్న నగర పోలీసు అధికారులు ఓ ప్రత్యేక బృందాన్ని పంపి అయూబ్‌ను హైదరాబాద్ కు తీసుకువచ్చారు.

ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన అయూబ్‌ ఖాన్‌ 1990లో హుస్సేనీఆలంలో నేరజీవితాన్ని ప్రారంభించాడు. అదే ఏడాది దోపిడీ, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. దీంతో 1991లో హుస్సేనీఆలం పోలీసులు హిస్టరీ షీట్‌ తెరిచారు. అయూబ్‌ కాలాపత్తర్‌లోని తాడ్‌బండ్‌కు మకాం మార్చడంతో ఈ షీట్‌ను ఆ ఠాణాకు బదిలీ చేశారు. హత్య, హత్యాయత్నం, దోపిడీ, బెదిరింపులు, ఆయుధ చట్టం తదితర ఆరోపణలపై నగరంలో వివిధ పోలీసుస్టేషన్లలో 48 కేసులు నమోదు కావడంతో గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. రెండేళ్ళ క్రితం విశాఖపట్నం నుంచి బోగస్‌ పాస్‌పోర్ట్‌ తీసుకున్న అయూబ్‌ దాని సాయంతో దుబాయ్‌ పారిపోయాడు. అక్కడ ఉండి నగరంలో వ్యవస్థీకృతంగా బంగారం స్మగ్లింగ్‌ సహా ఇతర దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

నగరంలో నమోదైన కేసులకు సంబంధించి అయూబ్‌పై నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు జారీ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు ఎల్‌ఓసీ జారీ చేసి అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు పంపారు. విదేశాల్లో ఉన్న అయూబ్‌ ఏ ఎయిర్‌పోర్టులో దిగినా... అదుపులోకి తీసుకుని తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా వాటిలో కోరారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారుజామున షార్జా నుంచి అయూబ్‌ నేరుగా ముంబై చేరుకున్నాడు. హైదరాబాద్‌కు వస్తే పోలీసులకు చిక్కుతాననే ఉద్దేశంతో అక్కడి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు.

ఎల్‌ఓసీ జారీ అయిన విషయం గుర్తించిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకుని అక్కడి ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు అప్పగించాయి. దీనిపై సమాచారం అందుకున్న నగర పోలీసు ఉన్నతాధికారులు అయూబ్‌ను తీసుకురావడానికి ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపారు. ఈ టీమ్‌ అయూబ్‌ఖాన్‌ను హైదరాబాద్‌ తీసుకువచ్చింది. విశాఖపట్నంలో మరో పాస్‌పోర్ట్‌ పొందడంతో ఏవైనా ఉల్లంఘనలకు ఉండి, ఆధారాలు లభిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా కేసు నమోదు చేయించాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement