నల్లగొండ నేతల్లో ‘నయీమ్’ వణుకు
- రాజకీయ నాయకులపై చర్యలుంటాయన్న వార్తలతో కలకలం
- నయీమ్‌తో నేతి విద్యాసాగర్, చింతలకు సంబంధాల నిర్ధారణ
- జిల్లాకు చెందిన ముగ్గురు, నలుగురు నేతలకూ సంబంధాలు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో కలిసి భూదందాలు, సెటిల్మెంట్లకు పాల్పడిన ఆయన అనుచరుల ఎపిసోడ్ అయిపోయింది. వారంతా అరెస్టయి జైలుకెళ్లి మళ్లీ బెయిల్‌పై విడుదలై కేసుల విచారణ ఎదుర్కొంటున్నారు. నయీమ్‌తో అంటకాగిన పోలీసు లపై చర్యలూ పూర్తయ్యాయి. ఐదుగురు అధికారులు సస్పెండ్ కాగా, మిగిలిన వారిని మౌఖిక విచారణ జరిపి నేరం రుజువైతే వారిని కూడా సస్పెండ్ చేసి కటకటాల పాలు చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇక, మిగిలిం దల్లా రాజకీయ నాయకులే. అది కూడా నల్లగొండ జిల్లాకు చెందినవారే. నయీమ్ అనుచరులు, అంట కాగిన పోలీసుల ఎపిసోడ్‌లు ముగిసిన తర్వాత రాజ కీయ నాయకుల పీకలపై కత్తి పెట్టేందుకు రంగం సిద్ధమవుతుందన్న వార్తలు ఇప్పుడు నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులకు వణుకు పుట్టిస్తున్నాయి.
జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన మండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్, భువనగిరికి చెందిన టీఆర్‌ఎస్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డిలకు నయీమ్‌తో ప్రత్యక్ష సంబంధాలున్న విషయం కూడా ఇప్పటికే నిర్ధారణ అయింది. ఇందులో విద్యాసాగర్‌ను నయీమ్ కేసు విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ విచారించింది కూడా. వీరిద్దరికి తోడు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వీరికి తోడు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిలకు కూడా నయీమ్‌తో సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది.
అయితే, వీరి ప్రత్యక్ష ప్రమేయం పోలీసు విచారణలో నిర్ధారణ అయిందా, వీరిద్దరూ కేవలం మాటామంతీలు మాత్రమే నడిపించారా, భూదందాలు చేశారా? అన్నది బయటకు రానీయడం లేదు. ఈ నేపథ్యంలో నయీమ్ తో ఎవరి సంబంధాలు ఎంత వరకు ఉన్నాయి? అందు లో నేరపూరిత కోణం ఎవరి విషయంలో నిర్ధారణ అయింది? వారిని అరెస్టు చేస్తారా? లేదా పదవులకు రాజీనామా చేయిస్తారా? తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం కూడా ఆ నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారడం విశేషం.
గన్‌లైసెన్స్ రద్దు?
నేతి విద్యాసాగర్ వ్యక్తిగత గన్ లైసెన్స్‌ను రద్దు చేసినట్టు తెలుస్తోంది. తన గన్‌లైసెన్స్‌ను పునరుద్ధరించాలని ఆయన చేసుకున్న దరఖాస్తును పోలీసులు తిరస్కరించారని సమాచారం. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత ఆయనపై నాలుగైదు కేసులు నమోదు కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో లభించిన డైరీ ఆధారంగా ఆయన ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యులు, బినామీలు, బంధువులు, పోలీసు ఉన్నతాధికారులు, అధికార, ప్రతిపక్షపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీల వివరాలు బయటపడ్డాయి.
మరో నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి తన కుటుంబీకుల పేరిట ఎలాంటి ఆస్తులు కూడగట్టకపోయినా, నయీమ్ తో కలసి నడిపిన ఓ భూదందాలో తన స్నేహితుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని పోలీసు విచారణలో తేలింది. ఎమ్మెల్యే గాదరి కిశోర్ కూడా నయీమ్‌కు దగ్గరయ్యాడని పోలీసు విచారణలో తేలినట్టు సమాచారం. నయీమ్ అనుచరులిద్దరిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు కాగా, వారిని పోలీసులు పట్టుకోకుండా తప్పించే యత్నం కిశోర్ చేశాడని, వారిని పోలీసులు వెంటాడినా పట్టుకోలేకపోయారని, భువనగిరి నుంచి తుంగతుర్తి వరకు పోలీసులు వెంబండించినా ప్రయోజనం లేకుండా పోయిందనే చర్చ అప్పట్లో హల్‌చల్ సృష్టించింది. వీరు ముగ్గురే కాకుండా నయీమ్‌తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న నలుగురైదుగురు నేతలు జిల్లాలో ఉన్నా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ప్రస్తుతానికి ఈ ముగ్గురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగు తోంది. మరి సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుం టారు..? రానున్న రోజుల్లో ఎలాంటి పరిణా మాలు జరుగుతాయన్నది వేచి చూడాల్సిందే.