నయీమ్‌తో ఖాకీ.. ఖద్దరు చెట్టపట్టాల్
భూముల డీడ్ పత్రాల్లో వెల్లడైన డీఎస్పీ లింకు
* ‘మన్సూరాబాద్ డీఎస్పీ రిఫరెన్స్’ అని రాసుకున్న నయీమ్
* పోలీసులు, నేతలు, మీడియాకు రూ.80 కోట్లు పంచినట్టు లెక్కలు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని పత్రాల సాక్షిగా వెల్లడైంది. నార్సింగి పోలీసులు నయీమ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, డైరీల్లో ఓ డీఎస్పీ అధికారి లింకు వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 35 జిరాక్సు ప్రతుల్లో హైదరాబాద్‌లోని గౌలిపురాకు చెందిన లాల్ భాయ్‌కి చెందిన సర్వే నం. 66/7కు సంబంధించిన విల్ డీడ్ కూడా ఒకటి.
దీనిపై మన్సూరాబాద్‌లో ఉండే ‘డీఎస్పీ రిఫరెన్స్’ అని నయీమ్ రాసుకున్నాడు. ‘మన్సూరాబాద్ డీఎస్పీ ల్యాండ్ డిటేల్స్’ అని రాసి ఉన్న మరో పత్రం కూడా లభ్యమైంది. వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న మన్సూరాబాద్‌కు డీఎస్పీ ఉండరు. ఇది సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లో ఉండటంతో డివిజన్‌కు ఏసీపీ ఉంటారు. వీటిని బేరీజు వేస్తున్న పోలీసులు అతడిని మన్సూరాబాద్ ప్రాంతంలో ఉండే లేదా గతంలో ఉన్న డీఎస్పీ స్థాయి అధికారిగా అనుమానిస్తున్నారు. లాల్‌భాయ్‌కు చెందిన వివాదాన్ని సెటిల్ చేయాలని, తన స్థలానికి ‘న్యాయం’ చేయమంటూ సదరు డీఎస్పీ నయీమ్‌ను ఆశ్రయించాడని భావిస్తున్నారు. ఈ పరిచయాల నేపథ్యంలోనే కొన్ని అంశాల్లో సదరు డీఎస్పీ నయీమ్‌కు సహాయ సహకారాలు అందించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే బంధువుతో రూ.3 కోట్ల డీల్
ఎల్బీనగర్ ఠాణా పరిధిలో 2010లో జరిగిన రామకృష్ణ హత్య కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ సైతం నయీమ్ ఇంట్లో లభించింది. మరోపక్క హైదరాబాద్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సమీప బంధువుతో రూ.3.5 కోట్ల లావాదేవీలు నెరిపినట్లు ఉన్న రికార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి మధ్యా సన్నిహిత సంబంధాలు ఉండి ఉంటాయని పోలీసులు అనుమానిస్తూ.. ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. నయీమ్‌కు చెందినదిగా అనుమానిస్తున్న ఓ డైరీని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో గడిచిన ఆరు నెలల్లో రూ.80 కోట్ల వరకు పోలీసులకు, మీడియా, రాజకీయ నాయకులకు పంచినట్లు లెక్కలున్నాయి. అందులో డీఎస్పీ-1, డీఎస్పీ-2, ఎమ్మెల్యే-1, ఎమ్మెల్యే-2, మీడియా-1, మీడియా-2... ఇలా మాత్రమే రాసి ఉండటంతో వారు ఎవరనేది ఆరా తీస్తున్నారు. మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇస్తానంటూ నయీమ్ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన పోలీసులతోనూ ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా అక్కడి అధికారుల సాయంతో దందాలు సాగించినట్లు అనుమానిస్తున్నారు.