కరువుపై గరంగరం!
♦ కరువు మండలాలు, రైతు రుణాలపై ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్
♦ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు
♦ రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపిందని కాంగ్రెస్ ఫైర్
♦ కరువు మండలాల ప్రకటనలో వివక్ష: జీవన్‌రెడ్డి
♦ కరీంనగర్‌లో ఒక్క మండలాన్ని కూడా ప్రకటించలేదని మండిపాటు
♦ వ్యవసాయ మంత్రి వైపు దూసుకెళ్లిన జీవన్‌రెడ్డి
♦ గందరగోళంతో సభ రెండుసార్లు వాయిదా.. కాంగ్రెస్ వాకౌట్
సాక్షి, హైదరాబాద్: కరువు అంశం అసెంబ్లీని కుదిపేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆదివారం సభ అట్టుడికింది. కరువు మండలాల ప్రకటనలో నిర్లక్ష్యం, రైతు రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీలపై ప్రభుత్వ వైఖరిపై మండిపడుతూ కాంగ్రెస్, ఇతర పక్షాలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టాయి. కరువుపై చర్చకు పట్టుపట్టడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. ఏకమొత్తంలో రుణమాఫీ చేయనందునే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ సభ్యులు దుయ్యబట్టారు.
సీఎం, మంత్రి జిల్లాల్లో వందశాతం కరువు మండలాలా?: జీవన్‌రెడ్డి
కరీంనగర్ జిల్లాలో కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం వివక్ష చూపిందని, మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపిక చేయలేదని కాంగ్రెస్ సభ్యుడు జీవ న్‌రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రశేఖరరావు సొంత జిల్లా మెదక్, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సొంత జిల్లా నిజామాబాద్‌లో వంద శాతం మండలాలను కరువు జాబితాలో పెట్టి కరీంనగర్‌లో ఒక్క మండలాన్ని కూడా ప్రకటించలేదని మండిపడ్డారు. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయలేదంటూ ఆగ్రహంతో వ్యవసాయ మంత్రి వద్దకు వచ్చి సంబంధించిన పత్రాలు చూపించారు. ఇందుకు మంత్రి పోచారం సమాధానమిస్తూ.. వర్షపాతం, అనావృష్టి, పంటల సాగు, దిగుబడి, సాగునీటి వనరుల్లో నీటి లభ్యత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని కరువు మండలాలు ఎంపిక చేశామన్నారు. సీఎం, మంత్రులతో సంబంధం లేకుండా తొమ్మిది మంది అధికారులతో కమిటీ వేసి కరువు మండలాలను ఎంపిక చేశామన్నారు.
జీవన్‌రెడ్డి తప్పేమీ లేదు: జానారెడ్డి
వ్యవసాయ మంత్రికి తగిన పత్రాలు చూపేందుకు తమ సభ్యుడు జీవన్‌రెడ్డి వద్దకు వెళ్లారని.. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరమేమీ లేదని ప్రతిపక్ష నేత జానారెడ్డి పేర్కొన్నారు. అత్యంత ముఖ్యమైన కరువు అంశంపై మరో 30 నిమిషాలైనా చర్చ చేపట్టాలని ఆయన పట్టుబట్టారు. అయితే అందుకు అధికారపక్షం అంగీకరించలేదు. స్పీకర్ మధుసూదనాచారి పద్దులపై చర్చను చేపట్టడంతో.. నిరసనగా కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి వచ్చి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను పది నిముషాల పాటు వాయిదా వేశారు. తర్వాత సమావేశమైనా చర్చకు స్పీకర్ అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.
రెండు విడతలుగా స్పీకర్ చర్చలు
తొలిసారి సభ వాయిదా వేసిన తర్వాత స్పీకర్ విపక్ష సభ్యులను తన చాంబర్‌కు పిలిచి చర్చించారు. అనంతరం సభ ప్రారంభం అయ్యాక కూడా పరిస్థితి మారకపోవడంతో మళ్లీ వాయిదా వేసి అధికార, విపక్ష సభ్యులను తన చాంబర్‌కు పిలిపించి చర్చించారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనా కొద్ది సేపటికే సోమవారానికి వాయిదా పడింది. ఆదివారం సభకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరు కాలేదు.
జీవన్‌రెడ్డి విచారం ప్రకటించాలి: కేటీఆర్
జీవన్‌రెడ్డి వ్యవసాయ మంత్రి వైపు దూసుకురావడాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. దీనిపై ఆయన విచారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ సభ్యుడితో క్షమాపణ చెప్పించాలన్నారు. కరువు విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడబోతుండగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి లేచి.. కరువుపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రానికి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.412 కోట్లు ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. రెండు గంటల పాటు ఒకే ప్రశ్నపై చర్చ జరిగిందని, కాంగ్రెస్ మరో రూపంలో ఈ అంశాన్ని చర్చకు తీసుకువస్తే సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తర్వాత జీవన్‌రెడ్డి మళ్లీ కరువు అంశాన్నే ప్రస్తావించడంతో స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో సభలో మళ్లీ గందరగోళం నెలకొంది. స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ముగించినట్లు ప్రకటించి పద్దులపై చర్చను మొదలుపెట్టారు.