‘గ్రేటర్’ ప్రచారానికి రేపటితో తెర
జంట నగరాలను చుట్టివచ్చిన గులాబీ దళాలు
రోడ్‌షోలతో హోరెత్తిన ప్రచారం
రహ దారులపైనే గడిపిన మంత్రులు
మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటనలు
నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగియనుంది. తొలిసారి గ్రేటర్‌లో పాగా వేసేందుకు నూటా యాభై డివిజన్లలో బరిలోకి దిగిన అధికార టీఆర్‌ఎస్ జంట నగరాల్లో ముమ్మరంగా ప్రచారం చేసింది. ‘జీరో టు హండ్రెడ్’ నినాదంతో దాదాపు రాష్ట్ర మంత్రులంతా ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ తరపున గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు చూసిన మంత్రి కేటీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మంత్రులు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల సీనియర్ నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పజెప్పిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్... ఈ-పబ్లిసిటీలో భాగంగా తెలంగాణ భవన్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లారు.
శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అభ్యర్థుల ఎంపికకు ముందే టీఆర్‌ఎస్ నాయకత్వం గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంత్రులు, సీనియర్ నేతలను ఇన్‌చార్జులుగా నియమించింది. ఒక్కో డివిజన్ బాధ్యతను ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీకి అప్పగించి విస్తృతంగా ప్రచారం చేసింది.
విశ్వనగరమే నినాదం
‘60 ఏళ్లుగా అందరికీ అవకాశం ఇచ్చారు. ఈసారి మాకు అవకాశమివ్వండి. చారిత్రక నగరమైన హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం..’ అంటూ టీఆర్‌ఎస్ ప్రచారం చేసింది. మేనిఫెస్టోలో పలు హామీలు ఇవ్వడంతోపాటు గత 18 నెలల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలనూ వివరించింది. మంత్రులు తమకు అప్పజెప్పిన నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో విస్తృతంగా తిరిగారు. బస్తీలు, కాలనీల్లో పాదయాత్రలు నిర్వహించారు. ఇంటింటి ప్రచారం, బహిరంగ సభలు నిర్వహించారు. కుల సంఘాలు, యూనియన్లు, ఆయా వర్గాల భేటీలతో టీఆర్‌ఎస్ వినూత్నంగా ప్రచారం చేసింది. మంత్రి కేటీఆర్ వరుసగా ఏడు రోజుల పాటు 120 చోట్ల రోడ్‌షోలలో ప్రసంగించారని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్పాయి.
నేడు సీఎం బహిరంగ సభ
గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి సీఎం కేసీఆర్ కేవలం మీట్ ది ప్రెస్‌లో పాల్గొనడం మినహా ఎలాంటి ప్రచారం చేయలేదు. అయితే ఎన్నికల ప్రచారం మరో ఇరవై నాలుగు గంటల్లో ముగుస్తుందనగా సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు. ఈ సభను శనివారం సాయంత్రం 4 నుంచి 10 గంటల దాకా నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారు. నూటా యాభై డివిజన్ల నుంచి బూత్‌ల వారీగా జనాన్ని ఈ బహిరంగ సభకు సమీకరించాలని టార్గెట్ పెట్టుకున్నామని పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.
సభా ప్రాంగణంలో ఇప్పటికే మూడు వేదికలు సిద్ధం చేశారు. ప్రధాన వేదికను సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయించారు. రెండో వేదికను బరిలో ఉన్న అభ్యర్థులకు... మరో వేదికను పార్టీ ప్రచార కళా బృందాల ఆట పాటలకు కేటాయించారు. ఈ సభకు జనం భారీగానే హాజరవుతారని అధికార పార్టీ భావిస్తోంది. సుమారు 2 వేల మంది పోలీసులను మోహరించనున్నట్లు సమాచారం. సభా ప్రాంగణంలో 50 ఎల్‌ఈడీలను, సభా ప్రాంగణం నుంచి ప్రధాన మార్గాల్లో కిలోమీటరు పరిధిలో మైకులను ఏర్పాటు చేస్తున్నారు.