బల్దియా ఎన్నికలు ఫిబ్రవరిలో?
► జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టు ఉత్తర్వుల ఎఫెక్ట్
► మరో వారానికి పైగా ఎన్నికల ప్రక్రియ వాయిదా
► శనివారంలోగా డివిజన్ల రిజర్వేషన్ల వెల్లడి
► వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈసీ
► హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తాం: సీఎం కేసీఆర్
► ప్రజలకు ఇబ్బందులను తప్పించేందుకే
► ఎన్నికల ప్రక్రియను కుదించాలనుకున్నామని వివరణ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల అంశం మరో మలుపు తిరిగింది. జనవరి నెలాఖరులోపే ముగియాల్సిన ఎన్నికల ప్రక్రియ మరో వారం రోజులకు పైగా వాయిదా పడడం ఖాయమైంది. జనవరి 23న ఎన్నికలు నిర్వహించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపిన రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం హైకోర్టు తీర్పుతో చుక్కెదురైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియ గడువును 21 రోజుల నుంచి 14 రోజులకు కుదిస్తూ సర్కారు జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. శనివారం (ఈనెల 9) లోగా జీహెచ్‌ఎంసీ డివిజన్ల రిజర్వేషన్లను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రిగానీ, శనివారం ఉదయంగానీ రిజర్వేషన్లకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసేందుకు అధికార వర్గాలు హడావుడి పడుతున్నాయి.
ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే ఎన్నికల షెడ్యూల్ జారీకి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. అంటే 9వ తేదీన రాత్రి లేదా 10న ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయి. 10వ తేదీ ఆదివారమైనప్పటికీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఇబ్బందేమీ లేదని అధికారులు చెబుతున్నారు. 11న లేదా 12న నోటిఫికేషన్ ఇచ్చి అదేరోజు నుంచి నామినేషన్లను స్వీకరించడం ప్రారంభించే అవకాశం ఉంది. అదే జరిగితే 19వ తేదీలోపు నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. సాధారణంగా నామినేషన్ల ప్రక్రియ ముగిశాక.. పన్నెండు రోజుల వ్యవధితో పోలింగ్ నిర్వహించే వీలుంది. అంటే జనవరి 31న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
కానీ ఎన్నికల గడువు మధ్యలో భోగి, సంక్రాంతి, రిపబ్లిక్‌డే సెలవు దినాలు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే... ఫిబ్రవరి 1 లేదా 2వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఆస్కారముందని తెలుస్తోంది. ఎన్నికల అనంతరం అవసరమైతే రీపోలింగ్, ఓట్ల లెక్కింపు, మేయర్ ఎన్నిక తదితర అంశాలకూ నిర్ణీత గడువు ఉంటుంది. మొత్తంగా ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని హైకోర్టు ఉత్తర్వులను బట్టి అధికారులు విశ్లేషిస్తున్నారు. ఫిబ్రవరి నెలారంభంలో పోలింగ్ నిర్వహిస్తే వెసులుబాటుగా ఉంటుందనే కోణంలో ఈసీ వర్గాలు పోలింగ్ తేదీలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తాం: సీఎం కేసీఆర్
హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తామని, కోర్టు చెప్పిన ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు తొలగించేందుకే తక్కువ వ్యవధిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలనుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు లక్ష మంది ఉద్యోగులు అవసరం. రాష్ట్రంలో ఉన్న మొత్తం మూడు లక్షల మంది ఉద్యోగుల్లో మూడో వంతు ఉద్యోగులు నెల రోజుల పాటు ఎన్నికల ప్రక్రియలో విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. దానివల్ల పరిపాలనలో అసౌకర్యం కలుగుతుంది. అభివృద్ధి పనులు కుంటుపడతాయి. హైదరాబాద్‌లో అతి ఎక్కువ జనసాంద్రత ఉంది. ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం తీసుకుంటే ప్రజలు అసౌకర్యానికి గురయ్యే అవకాశముంది. ఈ కారణాల దృష్ట్యా జీహెచ్‌ఎంసీ ఎన్నికలను తక్కువ సమయంలో పూర్తిచేయాలని నిర్ణయించాం. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 21 రోజుల్లో పోలింగ్ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం..’’ అని కేసీఆర్ చెప్పారు.
ఈ తేదీల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు (అంచనా)
9న లేదా 10వ తేదీన: ఎన్నికల షెడ్యూల్ విడుదల
11 లేదా 12న: నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
19వ తేదీ నాటికి: నామినేషన్లు, ఉపసంహరణ, పరిశీలన పూర్తి
జనవరి 31 లేదా ఫిబ్రవరి 1, 2 తేదీల్లో: పోలింగ్ నిర్వహణ
ఫిబ్రవరి 10వ తేదీనాటికి: అవసరమైతే రీపోలింగ్, ఓట్ల లెక్కింపు, మేయర్ ఎన్నిక