
‘డబుల్’ రెబల్స్!
జీహెచ్‌ఎంసీ ఎన్నికల రంగంలో రెండు డివిజన్లలో భార్యా భర్తలు బరిలోకి దిగారు. ఆయా పార్టీల టికెట్లు దక్కకపోవడంతో వీరు రెబల్స్‌గా మారారు. ఖైరతాబాద్ డివిజన్ బీజేపీ రెబల్ అభ్యర్థిగా పి.సావిత్రి సురేందర్ నామినేషన్ దాఖలు చేయగా బంజారాహిల్స్ డివిజన్ నుంచి బీజేపీ రెబల్ అభ్యర్థిగా సావిత్రి భర్త పి.సురేందర్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో తామిద్దరం ఘన విజయం సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇక బంజారాహిల్స్ డివిజన్ టీడీపీ టికెట్ దక్కకపోవడంతో శ్రీనివాస్‌నాయుడు రెబల్‌గా మారారు. ఆయనతోపాటు ఆయన సతీమణి సుజాతతోనూ నామినేషన్ వేయించారు. ఈమె స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు.
ఇద్దరిలో ఎవరు గెలుస్తారని ప్రశ్నించగా మా ఆయనే గెలుస్తాడంటూ సుజాత ముసిముసినవ్వులు నవ్వగా.. లేదు ప్రజల సేవలో ఉన్న తన భార్యకే డివిజన్ ప్రజలు పట్టం కడతారంటూ శ్రీనివాస్ నాయుడు గర్వంగా చెప్పారు. మొత్తమ్మీద బంజారాహిల్స్ డివిజన్‌లో బీజేపీ, టీడీపీలకు పోటీగా రెండు జంటలు రెబల్స్ అవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
- బంజారాహిల్స్