రూ. 3936 కోట్లు!
=ఇది వచ్చే ఏడాదికి జీహెచ్‌ఎంసీ బడ్జెట్
=ముసాయిదా కసరత్తు షురూ
=ఏటా కేటాయింపులే ఘనం.. అమలు అంతంతే
సాక్షి, సిటీబ్యూరో: వచ్చే ఆర్థిక సంవత్సరం (2014-15) బడ్జెట్‌పై జీహెచ్‌ఎంసీ కసరత్తు ముమ్మరం చేసింది. షెడ్యూలు మేరకు ఈనెల 10లోగా ముసాయిదా బడ్జెట్‌ను స్టాండింగ్ కమిటీ సభ్యులకు అందజేయాలి. దీంతో తుదిరూపునిచ్చేందుకు శ్రమిస్తున్నారు. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి (2013-14) రూ.3800 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించారు. ఏటా కేటాయింపులు భారీగా ఉంటున్నా.. అందులో దాదాపు సగం నిధులే ఖర్చు చేయగలుగుతున్నారు. మిగతావి అంకెల్లో తప్ప వినియోగంలోకి రావట్లేదు. ప్రస్తుత బడ్జెట్ రూ. 3800 కోట్లు కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి దీనిని రూ. 4000 కోట్లకు పెంచే అవకాశాలున్నాయి.
తాజా వివరాల ప్రకారం.. రూ. 3936 కోట్లతో కొత్త బడ్జెట్‌ను అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇది ప్రాథమిక కసరత్తే అయినందున.. స్టాండింగ్ కమిటీ నుంచి జనరల్‌బాడీ సమావేశానికి వెళ్లి అక్కడ ఆమోదం పొందేలోగా మార్పులకు అవకాశాలు మెండు. ఏటా జరుగుతున్న తంతే ఇది. ప్రస్తుత సంవత్సరం కంటే బడ్జెట్‌ను తగ్గించడం బాగుండదనే తలంపుతోనే ఏటా మొత్తం పెంచేస్తున్నారు. ఈసారీ అదే పునరావృతమైతే ఆమోదం పొందే సమయానికి బడ్జెట్ రూ. 3900- 4000 కోట్ల మధ్య ఉంటుందనేది అంచనా. కేటాయింపులు భారీగా ఉన్నా.. ఏ ఒక్క ఏడాదీ దాదాపు రూ.2200 కోట్లకు మించి ఖర్చుచేయలేదు.
తీరు మారేనా?
ఇటీవలే కొత్త కమిషనర్ రావడంతో పాటు త్వరలోనే మేయర్ మార్పు కూడా జరగనున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ తీరుతెన్నులెలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్- ఎంఐఎం ఒప్పందం మేరకు జనవరిలో కాంగ్రెస్ వారు మేయర్ కావాల్సి ఉంది. కొత్త మేయరే బడ్జెట్‌ను జనరల్‌బాడీ సమావేశంలో చర్చకు ఉంచి.. ఆమోదం పొందాల్సి ఉన్నందున ఆయన ఆలోచనలకనుగుణంగానే బడ్జెట్ తుదిరూపు దిద్దుకోనుంది.