45 రోజులు.. టార్గెట్ రూ.455 కోట్లు! | ghmc speed up collecting tax | Sakshi
Sakshi News home page

45 రోజులు.. టార్గెట్ రూ.455 కోట్లు!

Published Tue, Feb 16 2016 7:06 PM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

45 రోజులు.. టార్గెట్ రూ.455 కోట్లు!

45 రోజులు.. టార్గెట్ రూ.455 కోట్లు!

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆస్తిపన్ను వసూలు ప్రక్రియలో జిహెచ్ఎంసి వేగం పెంచింది. ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకున్న గడువు మరో 45 రోజులు మాత్రమే మిగిలిఉండగా ఈ రోజుల్లోనే దాదాపు రూ.455కోట్ల ఆస్తిపన్ను రాబట్టేందుకు కసరత్తు వేగం పెంచింది. ఈ మేరకు జిహెచ్ఎంసి అధికారులకు జిహెచ్ఎంసి కమిషనర్ బి జనార్ధన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31లోగా నగర పరిధిలో దాదాపు రూ.1100కోట్లు ఆస్తిపన్నుగా రావాల్సి ఉంది.

ఇందులో ఇప్పటి వరకు రూ.545కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన కొద్ది రోజుల్లో మొత్తం పన్ను వసూలుకు లక్ష్యం పెట్టుకున్నారు. స‌ర్కిళ్ల వారిగా 24మంది ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించి ప్రతి రోజు రూ.10కోట్లు రాబట్టేందుకు నిర్ణయించారు. అధిక‌మొత్తంలో ప‌న్ను బ‌కాయిలు ఉన్న‌ వారిని వ్య‌క్తిగ‌తంగా క‌ల‌వ‌డం, ఫోన్‌, ఎస్ఎమ్ఎస్‌, ఈ-మెయిళ్ల ద్వారా గుర్తుచేయ‌డంలాంటి చ‌ర్య‌లు ఇందుకు అనుసరిస్తారు. బ‌కాయిదారుల‌కు అవ‌స‌ర‌మైతే రెడ్ నోటీసులు జారీచేయనున్నారు.

దీంతోపాటు ఇప్ప‌టివ‌ర‌కు ఆస్తిప‌న్ను మ‌దింపు కాని భ‌వ‌నాల‌ను గుర్తించ‌డం, త‌క్కువ ప‌న్ను ఉన్న భ‌వ‌నాలను గుర్తించి వాటి ప‌న్ను విధింపును నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి స‌రిచేయాల‌ని అధికారుల‌కు క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వం నుంచి మెరుగైన సేవలు పొందేందుకు ముందుగానే పన్ను చెల్లించాలనే విషయాలను ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య పరచాలని కూడా కోరారు. ప్రాప‌ర్టీ ట్యాక్స్ ప‌రిష్కారం,  న‌గ‌రంలో ఆస్తిప‌న్ను వివాదాల ప‌రిష్కారానికై ఈ నెల 21న అన్ని స‌ర్కిల్ కార్యాల‌యాల్లో ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయన ప్రకటించారు.

ఆస్తిప‌న్ను విష‌యంలో వ్య‌త్యాసాలు, ప‌న్నుదారుల స‌మ‌స్య‌లు, ఇత‌ర లీగ‌ల్ అంశాల‌ను సామ‌ర‌స్యంగా అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్క‌రించేందుకు వీలుగా 21న ప్రాప‌ర్టీ ట్యాక్స్ ప‌రిష్కారాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. స‌ర్కిళ్ల డిప్యూటి క‌మిష‌న‌ర్ల‌తో స‌హా అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది పాల్గొని స‌మ‌స్య‌లు, ఫిర్యాదులు ప‌రిష్క‌రిస్తార‌ని వివ‌రించారు. గ్రేట‌ర్‌లో ఉన్న 14 ల‌క్ష‌ల ప్రాప‌ర్టీల్లో దాదాపు 5ల‌క్ష‌ల ప్రాప‌ర్టీల‌కు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ ఆస్తిప‌న్ను మిన‌హాయింపు ల‌భించింద‌ని, మిగిలిన 8ల‌క్ష‌ల ఆస్తుల‌కు సంబంధించి ప‌న్నును వ‌సూలు చేయ‌డంలో శ్ర‌ద్ధ చూపించాల‌న్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement