జీహెచ్‌ఎంసీకి హెచ్‌ఎండీఏ విజ్ఞప్తి
మార్చి నెలాఖరుకు అప్పగింత
బాధ్యతల నుంచి వైదొలిగేందుకు నిర్ణయం
శివార్లలో పచ్చదనంపై అర్బన్ ఫారెస్ట్రీ దృష్టి
సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ పరిధిలోని పార్కులు, రోడ్ మీడియన్స్, ఐల్యాండ్స్, ఎస్టీపీల నిర్వహణ బాధ్యతను ఇక తాము మోయలేమంటూ హెచ్‌ఎండీఏ చేతులెత్తేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలో విస్తృతంగా పచ్చదనాన్ని అభివృద్ధి చేయాల్సి ఉన్నందున గ్రేటర్ పరిధిలోని పార్కులు, మీడియన్స్ నిర్వహణ బాధ్యత నుంచి వైదొలుగుతున్నట్లు అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి గతంలో ఆయా పార్కులు, మీడియన్స్ బాధ్యత జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనే ఉండేదని, అప్పటి ప్రభుత్వం సూచనల మేరకు వాటి నిర్వహణ బాధ్యతను హెచ్‌ఎండీఏ చేపట్టిందని చెబుతున్నారు. ఇప్పుడు హెచ్‌ఎండీఏ ఆర్థిక సమస్యల్లో చిక్కుకొన్నందున ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా పార్కుల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకొంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలో పచ్చదనాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీదే కనుక మొత్తం 39 పార్కులు, మీడియన్స్, ఐల్యాండ్స్ తదితరాల నిర్వహణ బాధ్యతను ఏప్రిల్ 1 నుంచి వారికి అప్పగించనున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పీవీ ఎక్స్‌ప్రెస్ హై వే పైన నిర్వహణ బాధ్యతలు జీహెచ్‌ఎంసీ చూస్తుండగా, ఫ్లైఓవర్ కింద మీడియన్‌లో మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు పచ్చదనాన్ని హెచ్‌ఎండీఏ నిర్వహిస్తోంది.
ఇలా ఒకే ప్రాంతాన్ని రెండు విభాగాలు చూడటం కంటే ఆ బాధ్యతను జీహెచ్‌ఎంసీయే చేపట్టడం శ్రేయస్కరం అని హెచ్‌ఎండీఏ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు... నిత్యం ప్రముఖులు రాకపోకలు సాగించే శంషాబాద్ రోడ్, మాదాపూర్ ఫ్లైఓవర్, స్పయినల్ రోడ్, కావూరి హిల్స్, తదిరత ప్రాంతాల్లో పచ్చదనం పర్యవేక్షణ బాధ్యతలు ఇరువిభాగాలు నిర్వహిస్తున్నాయి. దీనివల్ల సొమ్ము హెచ్‌ఎండీఏది... సోకు జీహెచ్‌ఎంసీది అన్న చందంగా మారిందని ఇకపై హెచ్‌ఎండీఏ పరిధిలో గ్రీనరీపెంచేందుకే నిధులు వెచ్చించాలని అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నిర్ణయించిం ది. ఈమేరకు బుధవారం హెచ్‌ఎండీఏ పాలకవర్గం సమావేశంలో కూడా ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథార్టీ పరిధిలోని లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్‌ల నిర్వహణను మాత్రం హెచ్‌ఎండీఏనే చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
జీహెచ్‌ఎంసీకి అప్పగించనున్న పార్కులు
పేరు ప్రాంతం
తిరుమలహిల్స్ పార్కు ముసారాంబాగ్
ఇందిరా ప్లే పార్కు వనస్థలిపురం
రాజీవ్‌గాంధీ పార్కు వనస్థలిపురం
ప్రియదర్శిని పార్కు సరూర్‌నగర్
మేల్కోటి పార్కు నారాయణగూడ
బాపూఘాట్ లంగర్‌హౌస్
శాస్త్రిపురంకాలనీ పార్కు బహదూర్‌పురా
ఎల్‌ఐజీ-22 పార్కు వనస్థలిపురం
సాయినగర్ కాలనీ పార్కు వనస్థలిపురం
ఫేజ్-2 కాలనీ పార్కు వనస్థలిపురం
పటేల్‌కుంట పార్కు కూకట్‌పల్లి
చిన్నతాళ్లకుంట పార్కు అత్తాపూర్
ఆస్‌బెస్టాస్ కాలనీ పార్కు జగద్గిరిగుట్ట
ఆ పార్కులు మీవే..!
Published Fri, Feb 20 2015 12:23 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement