దుర్గాదేవి, యామిని(ఫైల్ ఫొటో)
హైదరాబాద్: నగర శివారులోని బాచుపల్లి పీఎస్ పరిధిలో బాలికల అదృశ్యం మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకూ ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం కాగా ఒకరి జాడ గుర్తించగా, మరో ఇద‍్దరి ఆచూకీ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అయితే అయిదు రోజుల కిందట అదృశ్యమైన 10 వతరగతి విద్యార్థిని పూర్ణిమ ఆచూకీని లభ్యం కాకపోవడంతో పోలీసులు కేసు విచారణ వేగమంతం చేశారు.
అయిదు రోజులైనా పూర్ణిమ వివరాలు తెలియకపోవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంతలోనే నిన్న(సోమవారం) మరో ఇద్దరు అమ్మాయిలు దుర్గాదేవి, యామిని కనిపించకుండా పోయారు. నిజాంపేట్ కు చెందిన దుర్గాదేవి (14) సోమవారం సాయంత్రం సరుకులు తెచ్చేందుకు కిరాణాషాప్ నకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు.
యామిని ఆచూకీ లభ్యం
నిజాంపేట్‌కు చెందిన యామిని 10 వతరగతి పరీక్షలలో పాస్ అయ్యింది. కాలేజిలో చేర్చేందుకు కుటుంబసభ్యులు అంతా సిద్ధం చేశారు.. ఇంతలో అంకుల్ ఇంటికి వెళ్లి వస్తానంటూ సోమవారం ఇంట్లో చెప్పి వెళ్లిన యామిని ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో బాలికల తల్లిదండ్రులు తమ కూతుళ్లు కనిపించడం లేదంటూ బాచుపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే యామిని ఆచూకీ మంగళవారం లభ్యమైనట్లు సమాచారం. బంధువుల ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.