పూర్ణిమా.. నీవెక్కడమ్మా..! | police did not find clue in missing hyderabad girl poornima case | Sakshi
Sakshi News home page

పూర్ణిమా.. నీవెక్కడమ్మా..!

Published Fri, Jul 14 2017 8:35 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

పూర్ణిమా.. నీవెక్కడమ్మా..! - Sakshi

పూర్ణిమా.. నీవెక్కడమ్మా..!

అదృశ్యమై నెల దాటినా దొరకని ఆచూకీ
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
18 బృందాలతో గాలిస్తున్నామన్న పోలీసులు
ఆధారం లభించకనే ఆలస్యం
బాలల హక్కుల సంఘం సాయం కోరిన తల్లిదండ్రులు


బాలిక అదృశ్యం.. పోలీసుల దృష్టిలో ఇదో రొటీన్‌ మిస్సింగ్‌ కేసు. తల్లిదండ్రులకు మాత్రం క్షణమొక యుగంగా గడిచే మానసిక క్షోభ. ఈ నరకయాతనను ఆ తల్లిదండ్రులు 40 రోజులుగా అనుభవిస్తున్నారు. కూకట్‌పల్లి నిజాంపేటకు చెందిన పదమూడేళ్ల పూర్ణిమ సాయి అదృశ్యం కథ ఇది. వేసవి సెలవుల్లో ఇంట్లో సరదాగా తిరిగిన కుమార్తె పాఠశాల పునఃప్రారంభమైన మూడోరోజే అదృశ్యమైంది. ఇన్ని రోజులవుతున్నా ఆచూకీ లభించకపోవడంతో కన్నవారు ఈ కేసు దర్యాప్తులో పోలీసుల అలసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

హిమాయత్‌నగర్‌: కూకట్‌పల్లికి చెందిన చొల్లంగి నాగరాజు, విజయకుమారి కుమార్తె పూర్ణిమ సాయి. గత నెల 7న యథావిధిగా స్కూల్‌కని వెళ్లింది. కొద్ది సేపటికే పాఠశాల నుంచి ‘పూర్ణిమ ఈ రోజు స్కూల్‌కి హాజరుకాలేదు’ అంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌ ఆ తల్లిదండ్రులకు ముచ్చెమటలు పట్టించింది. సమీపంలోని బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆరా తీసినా పూర్ణిమ జాడ లేకపోవడంతో బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 40 రోజులవుతున్నా ఈ అదృశ్యం కేసులో పురోగతి లేదని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గురువారం వారు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ గోడు చెప్పుకున్నారు. ‘పూర్ణిమా.. ఎక్కడున్నావ్‌ తల్లీ.. ఇంటికి రా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

సీసీటీవీ పుటేజీలు పరిశీలించలేదు..
పూర్ణిమ సాయి స్థానికంగా ఉన్న భాష్యం స్కూల్‌లో పదో తరగతి విద్యార్థిని. ఈ స్కూల్‌ నిజాంపేట మెయిన్‌ రోడ్డులో ఉంది. ఇదే రహదారిలో భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, సూపర్‌ మార్కెట్స్‌తో పాటు విద్యా సంస్థలు ఉన్నాయి. వీటన్నింటికీ సీసీ కెమెరాలు ఉంటాయని, రహదారిలోనూ ఉన్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమార్తె అదృశ్యం కేసు దర్యాప్తులో పోలీసులు వీటిని పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. కేవలం స్కూలు సమీపంలో ఉన్న ఓ ఫర్నిచర్‌ షాప్‌ సీసీ పుటేజీలను మాత్రమే పరిశీలించారన్నారు. ఇందులో పూర్ణిమ స్కూల్‌ గేటు వరకు వెళ్లినట్లు స్పష్టంగా కనిపించిందని, దర్యాప్తు అక్కడితో ఆగిపోయిందని వాపోతున్నారు. పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న మిగిలిన కెమెరాలను ఎందుకు పరిశీలించడం లేదని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు  ప్రశ్నిస్తున్నారు.

ఇద్దరిపై అనుమానాలు..
తమ కుమార్తె అదృశ్యానికి సంబంధించి ఆమె చదువుతున్న పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న మహిళా సంఘం నాయకురాలు రేఖ సైతం పోలీసుల దర్యాప్తు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్‌లోనూ సీసీ కెమెరాలు ఉండాలని, పూర్ణిమ చదువుతున్న భాష్యం స్కూల్‌లో ఎందుకు లేవని అచ్యుతరావు ప్రశ్నించారు. బాలిక అదృశ్యం తర్వాత యాజమాన్యం స్పందించి సీసీ కెమెరాలు అమర్చిందని, ముందే ఈ పని చేస్తే తమ కేసులో ఉపయుక్తంగా ఉండేదని పూర్ణిమ తల్లిదండ్రులు చెప్తున్నారు. బాలిక మిస్సింగ్‌ కేసు దర్యాప్తులో పోలీసుల వైఫల్యాన్ని బాలల హక్కుల సంఘం తప్పుబడుతోంది.

పోలీసులు చెబుతున్నది ఇదీ..

  •  జూన్‌ 7న స్కూల్‌కు బయలుదేరిన పూర్ణిమ తరగతులకు హాజరుకాలేదని ఆ రోజు ఉదయం తల్లికి స్కూల్‌ నుంచి ఫోన్‌కాల్‌ వెళ్లింది. ఆ సమయంలో ఆమె రిసీవ్‌ చేసుకోలేదు. తిరిగి ఫోన్‌ చేయలేదు.
  •  మధ్యాహ్నం 1.30 తర్వాత స్కూల్‌ నుంచి ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లి యజమాన్యాన్ని సంప్రదించారు. రాలేదని వారు సమాధానం చెప్పడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు.
  •  ఫలితం కనిపించకపోవడంతో అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన సీఐ బాలకృష్ణారెడ్డి కేసు తీవ్రతను పైస్థాయి అధికారులకు తెలిపారు.
  •  దీంతో మొత్తం 18 బృందాలను ఏర్పాటు చేశారు. సిటీలోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయినా ఎక్కడ ఫలితం కనిపించలేదు.
  •  వైజాగ్, యానాం, షిర్డీ, చెన్నై, తిరుపతిలోను ప్రత్యేక బృందాలతో వెతికించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని డీజీపీలు, జిల్లాల ఎస్‌పీలకు సమాచారం అందించారు.
  •  కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహరాష్ట్ర డీజీపీలకు కూడా ఆ అమ్మాయి ఫొటోలను పంపించి కనబడితే సమాచారం అందించాలని కోరారు. బెంగళూరు, చెన్నై, థానే, ముంబై పోలీసు కమిషనర్లకు కూడా పూర్ణిమ ఫొటోలు పంపించారు.
  •  దాదాపు అన్ని కేసుల్లో మిస్సింగ్‌ కేసుల్లో 90 శాతం స్పష్టత కనిపించినా ఈ కేసులో మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదని సైబరాబాద్‌ పోలీసులు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement