
రూ.1,500 బోనస్ ఇవ్వండి
- మిర్చి క్వింటాలుకు ఇవ్వాల్సిందిగా కేంద్రానికి తాజాగా ప్రతిపాదన
- తక్కువ ధరకు విక్రయించిన, విక్రయిస్తున్న రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి
- రాష్ట్ర ప్రభుత్వ గత విన్నపాలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
- ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్న వ్యాపారులు
- గిట్టుబాటు ధర రాక మిర్చి రైతుల ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: మిర్చి రైతులకు క్వింటా లుకు రూ.1,500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ మార్కెటింగ్ శాఖ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదించింది. గతంలో క్వింటాలుకు రూ.7 వేలు చెల్లించేలా చర్యలు తీసుకో వాలని కోరిన మార్కెటింగ్ శాఖ, దానితో పాటు ప్రత్యామ్నాయంగా బోనస్ విషయాన్ని ప్రస్తావించింది. 70 శాతం వరకు రైతులు వ్యాపారులకు ఇప్పటికే తక్కువ ధరకు విక్రయించినందున వారందరినీ గుర్తించి రూ.1,500 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. తాము గతంలో పేర్కొ న్నట్లు క్వింటాలుకు గిట్టుబాటు ధరగా రూ. 7–8 వేలు చెల్లించేలా నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే విక్రయించిన రైతులకు ప్రయోజనం ఉండదని, వ్యాపారులు బాగుపడతారని, కాబట్టి మిర్చి రైతులను గుర్తించి వారికి పరిహారంగా రూ.1,500 ఇవ్వడమే సమంజసమని విన్నవించింది.
అలాగే మార్కెట్‌కు తరలివచ్చే రైతులకు కూడా రూ.1,500 చెల్లించేలా నిర్ణ యం తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికా రులు కోరారు. ప్రస్తుతం మార్కెట్‌లో మిర్చి ధర క్వింటాలుకు రూ.4,500 వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వం రూ.1,500 బోనస్ ఇస్తే క్వింటాలుకు రూ.6 వేలు రైతుకు అంద నుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం అందుకు అంగీకరిస్తే ఇప్పటికే వ్యాపారులకు విక్రయించిన రైతులను రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గుర్తి స్తామని, ఎకరానికి సరాసరి పండిన పంటను లెక్కలోకి తీసుకొని రూ.1,500 చెల్లిస్తామని అంటున్నారు. అయితే కేంద్రం మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
జనవరి నుంచి ధర పతనం
వాస్తవంగా సీజన్ ఆరంభంలో మిర్చి ధర కొంత బాగుంది. జనవరి నుంచి ధర పతనం మొదలైంది. ఫిబ్రవరిలో దాదాపు రూ.1,500 తగ్గింది. పంట ఉత్పత్తి అధికంగా వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో అనూహ్యంగా ధర పతనమైంది. మార్చి మొదట్లో రూ.8 వేలకు తగ్గగా.. రెండో వారం నుంచి రూ.6–5 వేలకు పడిపోయింది. ప్రస్తుతం రోజుకు కొంత చొప్పున ధర పడిపోతోంది. రైతుకు ఎకరా పంట సాగు, కోతకు రూ.లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది. రూ. 4,500కు ధరకు పడిపోవడంతో ఎకరాలో పండిన పంట నుంచి రూ.80 వేలకు మించి రావటం లేదని రైతులు వాపోతున్నారు. ధరల పతనంతో మిర్చి రైతులు హాహాకారాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మిర్చి కొనుగోలుకు అనుమతిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాసినా, ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీకి వెళ్లి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.
ఇష్టారాజ్యంగా ధరలు
ఊహించని రీతిలో మిర్చి ధర పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలుకు సగటున ధర రూ.4,500 మించడంలేదు. కొన్ని చోట్ల నాణ్యత లేదంటూ రూ.3 వేలకు మించి కొనుగోలు చేయడంలేదు. తక్కువ ధరపై రైతులు ప్రశ్నిస్తే కొనుగోలు చేయ కుండా వ్యాపారులు సతాయిస్తున్నారు. బతిమిలాడితే మరో వందో యాభయో చేతిలో పెడుతున్నారు. ఇలా వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తూ మిర్చి కొనుగోలు చేస్తున్నారు.