ఎమ్మెల్సీల ఎక్స్‌అఫీషియో హోదాపై ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం
రాత్రి ఆమోదముద్ర వేసిన గవర్నర్ నరసింహన్
ఆ వెంటనే ఉత్తర్వు జారీ
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలతో ఆగమేఘాలపై స్పందించిన వైనం
మేయర్ ఎన్నికలో ఎమ్మెల్సీలు ఓటు వేసేందుకు అడ్డు తొలగినట్టే
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. దీనికి గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో సభ్యత్వాన్ని కట్టబెడుతూ జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరిస్తూ కొద్దిరోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వు (జీవో 207)ను రద్దు చేసింది. దాని స్థానంలో తనకున్న ప్రత్యేకాధికారాలతో ఆర్డినెన్స్‌ను తెచ్చింది.
ఆగమేఘాలపై..
ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసే నాటికి లేదా గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే నాటికి గ్రేటర్ పరిధిలో నమోదైన ఎమ్మెల్సీలకే ఎక్స్ అఫీషియో హోదాలో మేయర్ ఎన్నికలో ఓటు వేసే అధికారం ఉంటుందన్న జీహెచ్‌ఎంసీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడ్నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనా/నామినేట్ అయినా తర్వాత జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటరుగా నమోదు చేసుకున్నవారికి ఎక్స్ అఫీషియో సభ్యత్వం కల్పిస్తూ కొద్దిరోజుల క్రితమే ఉత్తర్వు జారీ చేసింది.
దీన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ ఉత్తర్వు జారీ విధానాన్ని జీర్ణించుకోవటం కూడా కష్టమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ ఉత్తర్వు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. శాసన వ్యవస్థ ద్వారా కాకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చట్టసవరణ సరికాదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.
ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతోనే ఈ ఉత్తర్వు జారీ చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదన విన్న ధర్మాసనం ప్రభుత్వం ఉత్తర్వు తేవటానికి అనుసరించిన విధానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారం వివాదాస్పదమవుతుండటాన్ని గుర్తించిన ప్రభుత్వం... ఓ అడుగు ముందుకేసి తనకున్న ప్రత్యేకాధికారాల ద్వారా ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది.
అనుకున్నదే తడువుగా గురువారం ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదానికి పంపగా ఆయన రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు దానిపై లోతైన అధ్యయనం అవసరమంటూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపే ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవటం గమనార్హం. ఆర్డినెన్స్ చట్టబద్ధమే అయినందున మేయర్ ఎన్నికలో ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోవటానికి మార్గం సుగమమైంది.
ఆర్డినెన్స్‌తో సరి!
Published Fri, Feb 5 2016 1:24 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM
Advertisement
Advertisement