సికింద్రాబాద్: చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలులో నగరానికి చేరిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు చెందిన 42 తులాల బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగు మాయమైంది. రైలు నల్గొండ దాటిన తర్వాత గుర్తించిన భాధితుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని జీఆర్‌పీ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. తదుపరి విచారణ నిమిత్తం కేసును సికింద్రాబాద్ రైల్వే పోలీసులు నల్గొండకు బదిలీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని హైటెక్‌సిటీలో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న రమాకాంత్ తన భార్యతో కలిసి చేన్నై ఎక్స్‌ప్రెస్ రైలులో సికింద్రాబాద్‌కు బయలుదేరాడు. బుధవారం అర్థరాత్రి దాటాక భార్యాభర్తలు ఇరువురు గాఢ నిద్రలోకి జారుకున్నాక వారి వెంట ఉండాల్సిన లగేజీబ్యాగు మాయమైంది. అందులో 42 తులాల బంగారు ఉన్నాయి.
తెల్లవారుజామున గుర్తించిన రమాకాంత్ సికింద్రాబాద్‌లో రైలుదిగి పోలీసులను ఆశ్రయించాడు. అయితే నల్గొండ ప్రాంతంలో బ్యాగును దొంగిలించిన ఆగంతకులు అందులోని ఆభరణాలను తీసుకుని బ్యాగును నల్గొండ రైల్వేస్టేషన్ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. బ్యాగును గుర్తించిన నల్గొండ జీఆర్‌పీ పోలీసులు అందులో లభించిన చిరునామా ఆధారంగా సికింద్రాబాద్ జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడి ఫిర్యాదు స్వీకరించిన సికింద్రాబాద్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం నల్గొండకు బదిలీ చేశారు.